Warangal | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన ఆదర్శ మండల సమాఖ్య ప్రతినిధి మహమ్మద్ నజీమాకు అరుదైన అవకాశం దక్కింది. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీలో మండల సమాఖ్యల నిర్వహణపై గురువారం జరిగిన జాతీయస్థాయి వర్క్‌షాప్‌లో రాష్ట్ర ప్రతినిధిగా ఆమె హాజరై ప్యానెలిస్ట్‌గా ప్రత్యేక ప్రాతినిధ్యం వహించారు.
దేశంలోని అన్ని రాష్ర్టాలతోపాటు 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మండల సమాఖ్యల లీడర్లు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా నజీమా మం డల సమాఖ్యల పురోగతిపై జరిగిన చర్చలో ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. తన వ్యక్తిగత జీవితం లో సాధించిన అభివృద్ధి, సంఘం, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల బలోపేతం విధి విధానాలను వివరించి అందరి ప్రశంసలు పొందారు.
మహమ్మద్ నజీమా 2007 నుంచి ఉమ్మడి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పర్యటించి వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్ ద్వారా దేశంలోని 15 రాష్ర్టాల్లో పర్యటించి, మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె ప్రతిభను గుర్తించిన కేంద్రం 2018లోనే జాతీయ స్థాయిలో ‘ఉత్తమ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్’ అవార్డుతో సతరించింది.