హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మహిళకు ఢిల్లీ వేదికగా అరుదైన గౌరవం దక్కింది. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)పై ఆమె చేసిన ప్రసంగం కేంద్రమంత్రినే కట్టిపడేసింది. ప్రసంగం ఆద్యంతం సభికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ర్టాల గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, స్వయం సహాయక సంఘాల సీఈవోలు, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) అధికారులతో మంగళవారం ఢిల్లీలో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ‘సంఘటన్ సే సమృద్ధి అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేశ్కుమార్సింగ్, అదనపు కార్యదర్శి చరణ్‌జిత్‌సింగ్, సంయుక్త కార్యదర్శి స్మృతిచరణ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జాన్‌పాక గ్రామానికి చెందిన శోభారాణి అనర్గళంగా ప్రసంగించారు. పేదరికం నుంచి బయటపడేందుకు స్వయం సహాయక సంఘాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయనే అంశాన్ని కళ్లకుకట్టినట్టు వివరించారు. ఆమె 15 నిమిషాలపాటు ప్రసంగించగా, ఆద్యంతం సభికులు చప్పట్లతో హోరెత్తించారు. కార్యక్రమానికి హాజరైన 500కుపైగా ఉన్నతాధికారులు, అధికారులు ఫిదా అయ్యారు. ఆమె ప్రసంగానికి ముగ్ధుడైన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ప్రసంగంలో పదేపదే శోభారాణి పేరును ప్రస్తావించారు. శోభారాణి గతంలోనూ ముస్సోరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పేదరికం, దానిని నుంచి బయటపడేందుకు స్వయం సహాయక సంఘాలు ఎలా ఉపయోగపడ్డాయనే అంశంపై ప్రసంగించి ప్రశంసలు అందుకొన్నారు.