కుభీర్ : ఎన్నికల్లో అన్నదమ్ములు , అక్కాచెళ్లెళ్లు, తండ్రి, కొడుకులు పోటీ చేయడం సాధారణ విషయం. కాన్ని అదే ఎన్నికల్లో ఒకే ఇంటికి చెందిన నలుగురు అన్నదమ్ములు( Four Brothers ) ఒకే మండలంలో విధులు నిర్వహించడం అసాధారణమైన ఘట్టం. నిర్మల్ జిల్లా కుభీర్ ( Khubeer ) మండల కేంద్రంలోని మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసే కేంద్రం వద్ద ఈ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.
జిల్లా కేంద్రానికి చెందిన రాజులదేవి చంద్రమోహన్, లక్ష్మీ దంపతుల కుమారులైన రమేష్ బాబు, సురేష్ బాబు, విజయ్ కుమార్, నరేష్ బాబు నలుగురు పేదరికంలో మగ్గుతు కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించారు. నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఉద్యోగరీత్యా విధులు నిర్వహిస్తున్నారు. ఒకే చోట నలుగురు అన్నదమ్ములు ప్రభుత్వ విధుల్లో కలుసుకోవడం చాలా అరుదు.
మంగళవారం కుభీర్‌లో ఎన్నికల విధులకు సంబంధించి సామగ్రి పంపిణీ కేంద్రంలో ఈ నలుగురు అన్నదమ్ములు ఒక్కచోట చేరడంతో మండల ప్రత్యేక అధికారి శంకర్‌తో పాటు ఎంపీడీవో సాగర్ రెడ్డి, ఎన్నికల అధికారులు జిలకరి రాజేశ్వర్, తహసీల్దార్ శివరాజ్, ఆయా శాఖల అధికారులు అన్నదమ్ములను వేదికపైకి పిలిచి అభినందించారు.
ఈ సందర్భంగా జిలకరి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ఘట్టం అపురూపమైనదని అందులోనూ ఎన్నికల ప్రక్రియలో నలుగురు అన్నదమ్ములు ఒకే చోట చేరి భాగస్వాములు అవ్వడం అరుదైన సందర్భంగా అభివర్ణించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏవో సారిక రెడ్డి, ఎస్సై కృష్ణారెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.