తొగుట, జనవరి 18 : పదవులు శాశ్వతం కావు కానీ, చేసిన పనులే చిర స్థాయగా నిలిచిపోతాయి. రాదు అనుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రాణాలను ఫణంగా పెట్టి సాకారం చేయడమే కాకుండా తెలంగాణ వస్తే పాలన ఆగమవుతుందన్న వారి చెంపచెల్లుమన్నట్లు 10 ఏళ్లలో తెలంగాణను అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించిన గొప్ప నాయకుడు కేసీఆర్(KCR). చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడి, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
అలాంటి నాయకుడి గొప్ప పాలనను మరొక్కసారి గుర్తించుకుంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి కుమారుడు, కుమార్తెలు విశృత్ రెడ్డి, సాన్వికరెడ్డి కేసీఆర్ సువర్ణ పాలనను గుర్తుచేసుకుంటూ వేసిన ముగ్గు ఎంతో ఆకట్టుకుంది. కేసీఆర్ హయాంలో పురుడుపోసుకున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్టు లాంటి సంక్షేమ పథకాలను ముగ్గులతో మరోసారి గుర్తు చేశారు. ఏమైనా కేసీఆర్ పాలన ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయింది అనడంలో సందేహం లేదు.