Deputy CM | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ‘ఆల్ జీబ్రా.. అబ్రక దబ్రా’ అన్నట్టు ఉన్నది సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన చెరువుల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్! లేని చెరువులను ఉన్నట్టు చూపి.. అవీ కాంగ్రెస్ హయాంలోనే కబ్జాకు గురైనట్టు పరోక్షంగా చూపి అభాసుపాలయ్యారు. బీఆర్ఎస్ హయాంలోనే చెరువులు ఎక్కువ కబ్జా అయ్యాయనే నెపం వేసే క్రమంలో 2014 కంటే ముందు, ఎక్కువ సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల కబ్జాలనే తాను విడుదల చేసిన రిపోర్టు ద్వారా బహిర్గతం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ‘కబ్జాల కాంగ్రెస్’ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల కబ్జా గురించి భట్టి మాట్లాడుతూ 2014 తర్వాత 20 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, 1956 నుంచి 2014 వరకూ హైదరాబాద్‌లో 225 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు. 1956 నుంచి 2014 వరకు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కదా? అని విశ్లేషకులు నొక్కిచెప్తున్నారు.
కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే..
భట్టి విడుదల చేసిన రిపోర్ట్ చూస్తుంటే కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఎక్కువశాతం చెరువులు కబ్జా అయినట్టు స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ రెండు పార్టీల పాలనలోనే సుమారు 10 రెట్ల ఆక్రమణలు జరిగినట్టు భట్టి రిపోర్టు ద్వారా తెలుస్తున్నదని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆక్రమణకు గురైనట్టు చెప్తున్న చిత్రాల్లో కొన్నింట్లో చెరువుల ఉనికే లేదని అంటున్నారు. చిన్న నీటి కుంటలను కూడా పెద్ద సరస్సులుగా చూపినట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ సెల్ఫ్‌డబ్బా కొట్టుకోవడంలోనే నిమగ్నమైందని, లేని చెరువులను చూపి అవి కబ్జా అయ్యాయని చెప్పే ప్రయత్నం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేస్తున్నారు.