రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు.. అందరి నోట్లో మెదిలే పేరు. ఆరోగ్య మంత్రి అయ్యాక.. ఆయన ప్రసంగాలకు గర్భిణులు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఎందుకో తెలుసా.. సాధారణ ప్రసవాలపై ఆయన మహిళలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా నార్మల్ డెలివరీల వల్ల కలిగే ప్రయోజనాలను విడమరిచి చెప్తున్నారు. సిజేరియన్ల వల్ల జరిగే అనర్థాలను సైతం వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు ప్రసంగాలతో గర్భిణులు ఎడ్యుకేట్ అవుతున్నారు. సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో సర్కార్ దవాఖానలకు క్యూ కడుతున్నారు. నార్మల్ డెలివరీలు చేయించుకుని, సంతోషంగా ఉంటున్నారు. వేల రూపాయాల విలువ చేసే కేసీఆర్ కిట్‌ను పొంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరీశ్‌రావు సార్ ప్రసంగాలు తమను ఎంతో ప్రభావితం చేశాయని అంటున్నారు గర్భిణులు. సాధారణ ప్రసవాలు చేయించుకుని సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పోచయ్య తన బిడ్డకు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించాడు. అక్కడ ఆమెకు సాధారణ ప్రసవం చేశారు వైద్యులు. అంతే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్‌ను కూడా అందించారు. నార్మల్ డెలివరీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వాటిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా.. చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ. కేసీఆర్ సర్ వల్ల వసతులు మంచిగా ఉన్నాయని నా బిడ్డను సిరిసిల్ల గవర్నమెంట్ పెద్దాసుపత్రికి తీసుకెళ్లాను. మా కేటీఆర్ సర్ కూడా ఆస్పత్రిలో మంచి సౌలత్లు ఏర్పాటు చేసిండు. ఆస్పత్రిలో ఏప్రిల్ 10, 2022 నాడు పురిటినొప్పులతో బిడ్డ బాధపడుతుంటే మా తమ్మునికి మబ్బుల ఫోన్ చేసిన. సాధారణ కాన్పు అయితే తల్లి, బిడ్డకు మంచిదని చెప్పిండు. కొద్దిగా ఓపిక పట్టు అని అన్నడు. అట్టనే అప్పుడప్పుడు మీరు సాధారణ కాన్పుల వల్ల జరిగే మంచి గురించి టీవీల్లో చెప్పడంతో మేము కూడా ఆస్పత్రికి సిబ్బందికి నార్మల్ డెలివరీ చేయమని చెప్పాం. డాక్టర్లు, సిబ్బంది నా బిడ్డకు నార్మల్ డెలివరీ చేశారు. పండంటి మగ బిడ్డ పుట్టిండు. బిడ్డ, మనుమడు ఆరోగ్యంగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు అవడం వల్ల పైసలు ఖర్చు కాలేదు. పైగా కేసీఆర్ కిట్ ఇచ్చారు. పైసా తీసుకోకుండా వాహనంలో ఇంట్లో దింపారు. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి.. నాకు, నా బిడ్డకు, మనుమడికి కలిగిన మేలు అందరికీ తెలువాలన్న ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నా సర్. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నయ్. అందరూ కాన్పుల కోసం గవర్నమెంట్ ఆస్పత్రులకే రావాలని కోరుతున్నా. నాకు జరిగిన మేలే అందరికీ జరగాలే.
ఇట్లు
శామంతుల వసంత
సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకొని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను, అదేవిధంగా సాధారణ కాన్పులు చేయించుకోవాలని నీకు జరిగిన మేలు అందరికి జరగాలని ఓ ఉత్తరం ద్వారా ఒక మంచి ఉపదేశం అందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వసంత నూరు వసంతాలు పిల్లపాపలతో వర్ధిల్లాలని మంత్రి హరీష్ రావు కోరుకున్నారు. ఈ ఉత్తరం మహిళలో ప్రజల్లో గొప్ప చైతన్యం, స్పూర్తిని ఇస్తుందన్నారు హరీశ్‌రావు.