బూర్గంపహాడ్ (భద్రాచలం), సెప్టెంబర్ 5 : పురిటి నొప్పులు పడుతున్న ఓ నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. భద్రాచలంలోని చప్టా దిగువ ప్రాంతానికి చెందిన సంధ్య నిండు గర్భిణి. పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో భద్రాచలం ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వైద్యులెవరూ అందుబాటులో లేరు. గర్భిణిని కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు సూచించారు. కొత్తగూడెం తీసుకెళ్తుండగా పురిటి నొప్పులు ఎక్కువై సంధ్య ఆటోలోనే ప్రసవించింది. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం ఏరియా దవాఖానలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. గత నెల 23న నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని పురిటి నొప్పులతో కాన్పు కోసం జిల్లా జనరల్ దవాఖానకు వచ్చి కుర్చీలోనే డెలివరీ అయింది. ఈ ఘటనను మరువకముందే.. ఇదే దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిర్వాకంతో.. మాడ్గులపల్లి మండలం గారకుంటపాలెంకు చెందిన చెరుకుపల్లి శ్రీలత గర్భంలో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మత్తు అలవాటు కలిగించే మందుల వాడకాన్ని (హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్) నియంత్రించేందుకు ఫార్మసిస్టులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మత్తురహిత సమాజ నిర్మూలనలో భాగంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, డీసీఏ చేపడుతున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ శ్రీనివాస్, కే శ్రీనివాస్ పేర్కొన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్ నుంచి ప్రిస్రిప్షన్ తీసుకొచ్చిన తర్వాతే మందులు కొనుగోలు చేయాలని రోగులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.