Indiramma House | తొర్రూరు, జూన్ 10 : ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ నిరుపేద మహిళకు ఘోర అవమానం ఎదురైంది. ఆడబిడ్డ అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బలుపు మాటలు మాట్లాడాడు. అధికార దర్పాన్ని చూపించాడు. తానూ ఒక మనిషినేనన్న సోయి మరిచి ఆడబిడ్డపై నోరు పారేసుకున్నాడు. ‘కర్రె ముఖం దానా.. నీకు ఇల్లు ఇయ్యను పో’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడని సదరు మహిళ కన్నీటి పర్యంతమైంది. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గుగ్గిళ్ల శ్రీదేవి, సుధాకర్ దంపతులు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. గుంటన్నర ఇల్లు జాగ తప్ప వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు.
అదే జాగలో చుట్టూ పరదాలు, పైకప్పుగా ఇనుప రేకులు వేసుకుని 20 ఏండ్లుగా అందులోనే ఉంటున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని శ్రీదేవి మంగళవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మోకాటి వెంకన్నను ఆయన ఇంటికి వెళ్లి కోరగా, తిట్టి పంపించాడని విలపించింది. ‘మాకు ఇల్లు జాగ తప్ప గుంట వ్యవసాయ భూమి లేదు. 20 ఏండ్లుగా పరదాలతో కట్టుకున్న గుడిసెలో ఉంటున్నాం. పురుగు పుట్రకు భయపడుతూ బతుకుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి’ అంటూ మంగళవారం ఉదయం వెంకన్న ఇంటికి వెళ్లి అడిగితే బూతులు తిట్టాడని శ్రీదేవి వాపోయింది. ‘కర్రె ముఖం దానా.. నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా? నీకు ఇల్లు ఎకడిది? నువ్వేమైనా నీళ్లు ఇచ్చావా? ఛాయ్ తాప్పిచ్చావా? పైసలు ఇచ్చావా? నేను బతికున్నంత కాలం నీకు ఇల్లు రానివ్వను’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టాడని ఆమె పేర్కొంది.
ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వలేని పేదలపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీదేవికి గతంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న సమాచారం ఉన్నదని, అయితే కొత్త లిస్టులో ఆమె పేరు లేదని గ్రామ కార్యదర్శి మౌనిక తెలిపారు. తాను ఇల్లు కట్టుకోలేదని, తనకు ఎలాంటి సమాచారం లేకుండానే తన పేరుతో ఎవరో నాయకులు బిల్లులు తీసుకొని మోసం చేశారని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధిత మహిళకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.