హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): క్యాబినెట్ మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావును బయటికి పంపేందుకు ముఖ్యనేత ప్లాన్ వేశారా? వారిద్దరిని ఇంకా ఎక్కువకాలం కొనసాగించవద్దని నిర్ణయించుకున్నారా? ఇందుకోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వైపు నుంచి నరుక్కొస్తున్నారా? అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఆ ఇద్దరు మంత్రులపై ‘అసమర్థ’ ముద్ర పడింది. వారిని క్యాబినెట్ నుంచి తప్పిస్తారని ముఖ్యనేత వర్గం సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నది. మంత్రివర్గ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు ఔట్’ అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నది. ముఖ్యనేత అనుచర సోషల్ మీడియానే పని గట్టుకొని లీకులు ఇచ్చి, ఈ కథనాలను వైరల్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రతిసారీ వీళ్లిద్దరే ఎందుకు టార్గెట్ అవుతున్నారనే కోణంలో ఆరా తీస్తే.. వాటాల వ్యవహారంలో ముఖ్యనేతకు ముందుగా ఎదురు తిరిగింది వీళ్లిద్దరే అని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5వ నెలల్లోనే మధ్యప్రదేశ్‌కు చెందిన 3 లిక్కర్ కంపెనీల బ్రాండ్లను తెలంగాణ రాష్ట్ర మద్యం మార్కెట్లోకి అనుమతించారు. అప్పటికే రాష్ట్ర మద్యం మార్కెట్లో ఉన్న బ్రాండ్ బీర్లకు కృత్రిమ కొరత సృష్టించి, వాటి స్థానంలో కొత్త బీర్ల బ్రాండ్లను చొప్పించేందుకు స్కెచ్ వేసినట్టు సమాచారం. ఈ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి రూ.100 కోట్లు బాండ్ రూపంలో ఇచ్చినట్టు, మరో రూ.50 కోట్లు తెలంగాణ నేతలకు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. మరోవైపు 2024లో అక్టోబర్‌లో ముఖ్యనేతకు, ఎక్సైజ్ నేతకు మధ్య వివాదం పొడసూపినట్టు చెప్తున్నారు.
టీజీబీసీఎల్ మద్యం సీసాలలో ప్రతి క్వార్టర్ మీద రూ.4 చొప్పున కమీషన్ తీస్తారని ప్రచారంలో ఉన్నది. ఈ మొత్తం డబ్బును ప్రతినెలా ముఖ్యనేత తీసుకుంటున్నారని, సంబంధిత శాఖ నేతకు ఇవ్వడం లేదని అప్పట్లో ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరిగింది. అటు కొత్త బ్రాండ్ల ద్వారా వచ్చిన రాబడి, ఇటు కమీషన్లో ఒక్క రూపాయి కూడా పంచి ఇవ్వకపోవడంతో ఎక్సైజ్ నేత ముఖ్యనేతపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో కొన్ని బీర్ల కంపెనీలకు అనుమతులు ఇవ్వడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదే అదునుగా తీసుకున్న ఎక్సైజ్ నేత.. మీడియా ముందుకు వచ్చి, కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని ప్రకటించారు. ఇక్కడి నుంచే ముఖ్యనేతకు, ఎక్సైజ్ నేతకు మధ్య వివాదానికి బీజం పడినట్టు తెలిసింది.
2024 అక్టోబర్‌లో ఎక్సైజ్ నేత నేరుగా ముఖ్యనేత వద్దకు వెళ్లి ‘టీజీబీసీఎల్ నుంచి వస్తున్న క్వార్టర్ సీసాల కమీషన్ మొత్తం మీరే తీసుకుంటే ఎలా?’ అని నిలదీసినట్టు ప్రచా రం జరిగింది. పక్కా లెక్కలతో వచ్చిన ఎక్సైజ్ నేతకు ముఖ్యనేత సర్దిచెప్పారని, ప్రస్తుతానికి అమెరికా వెళ్లిరమ్మని చెప్పి పంపినట్టు తెలిసింది. ఆయన అటు విదేశాలకు వెళ్లగానే.. ఇ టు పక్కాగా సమాచారం ఎక్సైజ్ నేతకు ఎలా చేరిందని ముఖ్యనేత ఆరా తీశారట! ఆ శాఖకు చెందిన అప్పటి కమిషనరే వివరాలు ఇచ్చినట్టు గుర్తించి, వెంటనే బదిలీ వేటు వేశారని, తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించారని ప్రచారం జరిగింది. ఇక అప్పటి నుంచి శాఖకు సంబంధించిన ఫైళ్లు ఎక్సైజ్ నేతకు కాకుండా కమిషనర్ నుంచి నేరుగా ముఖ్యనేతకు చేరేవని సచివాలయ వర్గాలు తెలిపాయి. చివరికి మంత్రి తనకు ఏదైనా సమాచారం కావాలంటే ఆర్టీఐ చట్టం ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వెల్లడించాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం మరింత ముదిరిందని చెప్తున్నారు. వీళ్ల ఇద్దరి మధ్య నలగలేక ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీనామా చేసి వెళ్లిపోయారనే ఆరోపణలున్నాయి.
ఒక సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణల మీద మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తప్పించింది. ఈ కేసులో సుమంత్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు అక్టోబర్ 15న రాత్రి ఏకంగా హైదరాబాద్‌లోని మంత్రి కొండా ఇంటికి వెళ్లి, విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో అరెస్టు వారెంట్ చూపించాలని కోరుతూ మంత్రి కూతురు సుస్మిత పోలీసు బృందాన్ని నిలదీశారు.
సుమంత్ గన్‌తో బెదిరించాడనే ఆరోపణలపై వచ్చామని పోలీసులు చెప్పగా, ఆమె సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత రోహిణ్‌రెడ్డి కూడా ఉన్నారని, ఈ వ్యవహారంలో వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ముఖ్యనేత పాత్ర కూడా ఉన్నదంటూ సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని, అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె నిలదీశారు. అప్పటి నుంచే ముఖ్యనేత సదరు మంత్రిని టార్గెట్ చేసినట్టు చెప్తున్నారు.
సిమెంట్ కంపెనీ వివాదం నేపథ్యంలోనే మేడారం జాతర పనుల టెండర్ల వ్యవహారంలో అదే జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి అయిన సురేఖను దూరం పెట్టారని చెప్తున్నారు. తన శాఖలో ఇతరులు జోక్యం చేసుకొని, తనను దూరం పెట్టడంపై ఆమె అప్పట్లోనే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని ప్రచారం జరిగింది. దీంతోపాటు యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ట్రస్ట్ కమిటీని ముఖ్యనేత ఏకపక్షంగా ప్రకటించారని, దేవాదాయ శాఖ మంత్రినైన తనను కనీసం సంప్రదించలేదని ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకే క్యాబినెట్ సమావేశాలకు డుమ్మాకొట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేశారని వెల్లడించాయి. దీంతో ముఖ్యనేత మరింత రెచ్చిపోయి ఆమెను మరింత పలుచన చేసేందుకు వరంగల్ జిల్లాలో ఆమె కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్న కడియం శ్రీహరిని రంగంలోకి దించారని చెప్తున్నారు.
ఈ క్రమంలోనే దేవాదాయ శాఖ మంత్రికి కనీస సమాచారం లేకుండా, ఆ శాఖ కమిషనర్‌తో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడం రాజకీయంగా దుమారం రేపింది. ‘శాఖ నాది.. సమీక్షలు నీవా?’ అంటూ ఆమె ఏకంగా ఏఐసీసీకి, సీఎంకు మూడు పేజీల ఘాటు లేఖ రాయడం పార్టీలో కలకలం సృష్టించింది. ము ఖ్యనేత అండ లేకుండా శాఖల విషయంలో జోక్యం చేసుకొనేంత సీన్ కడియంకు లేదనే వాదన వినిపిస్తున్నది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇద్దరు మంత్రులకు ముఖ్యనేత వ్యూహాత్మకంగానే పొగ పెడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. నేరుగా పొమ్మనలేక శాఖల్లో పలుచన చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు ఏఐసీసీలోని తన మార్గదర్శి ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ముఖ్యనేతతో వివాదంలో మహిళా మంత్రి వెనుకడుగు వేసినా, ఆమె కుమార్తె వెనక్కి తగ్గడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యనేత కుటుంబంతో అమీతుమీ తేల్చుకొనేందుకే సిద్ధమైనట్టు సమాచారం. సిమెంట్ కంపెనీ వివాదం జరిగినప్పటి నుంచి ఆమె ముఖ్యనేత సోదరుల కదలికల మీద కన్నేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఇద్దరు సోదరులను లక్ష్యంగా చేసుకొన్నారని, వారిని అనుక్షణం గమనించేందుకు ప్రత్యేకంగా డిటెక్టివ్‌లను నియమించారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతున్నది. వారు ముఖ్యనేత సోదరులను నీడలా వెంబడిస్తున్నారని చెప్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ పెద్ద మనిషిని కలువడానికి ముఖ్యనేత సోదరులు బెంగళూరుకు వెళ్లారని, వారిని అనుసరించి డిటెక్టివ్లు కూడా వెళ్లారని, ఈ విషయం తెలిసి భయంతో వారు అర్ధాంతరంగా వెనుదిరిగినట్టు ప్రచారం జరుగుతున్నది.