Telangana | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పాలనపై వికలాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి.. ఇంత వరకు పెన్షన్లు పెంచకపోవడం దారుణమని ప్రజా భవన్ వద్ద ఓ వికలాంగురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్ ఉన్నప్పుడు వికలాంగులకు బస్ పాస్లు ఉండే.. ఇప్పుడు ఆ బస్ పాస్లన్నీ క్యాన్షిల్ చేశారని బోరుమన్నారు ఆమె. ప్రజా భవన్ వద్ద అధికారులకు అనేక సార్లు వినతులు సమర్పించినా, అవి పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు.
వికలాంగులు ఎవరైనా సరే ఆడ, మగ అనే తేడా లేకుండా బస్ పాస్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడోళ్లను చూస్తే ఫ్రీ బస్సులు కూడా ఆపడం లేదు. ఫ్రీ బస్సులు పెట్టి ఏం లాభం..? మేం ఏమైనా ఫ్రీ ప్రయాణం అడిగామా..? రేషన్ కార్డు ఇస్తా అన్నావు.. ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లేవు. నువ్వొచ్చి ఏడు నెలలు అయితుంది. ప్రజా పాలన అంటే ఇదేనా..? రూ. 2 లక్షల ఉద్యోగం చేసే వాళ్లు కూడా ఫ్రీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం పథకాన్ని ఎత్తేయాలి. వికలాంగులకు పెన్షన్లు పెంచాలి. నెల రోజుల్లో పెన్షన్లు పెంచకపోతే రాబోయే రోజుల్లో వికలాంగులంతా కలిసి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. వికలాంగులను తక్కువ అంచనా వేయకండి.. మేం తలచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అని ఆ వికలాంగురాలు హెచ్చరించారు.