నెట్వర్క్ నమస్తే తెలంగాణ, అక్టోబర్ 1 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు గందరగోళంగా మారింది. పలు పంచాయతీల్లో ఓట్లు తక్కువగా ఉన్నవారికి కేటాయించారని ఆందోళనలు చేస్తున్నారు. తండాల్లోని రిజర్వేషన్లు సైతం జనరల్, బీసీ అభ్యర్థులకు కేటాయించడంపై మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అత్నూర్, చీకుర్తి, ఖలీల్‌పూర్‌లో ఎస్సీ ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్కవార్డునూ వారికి కేటాయించలేదని మండిపడుతున్నారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరులో సర్పంచ్, వార్డుల్లో పోటీ చేయడానికి ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టర్ రిజ్వాన్బాషాకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఎస్సీ, ఎస్టీల ఓట్లే అధికంగా ఉన్నప్పటికీ సర్పంచ్ పదవి బీసీలకు రిజర్వు చేశారని తెలిపారు. మొత్తం 8 వార్డులు ఉన్నాయని, 7వ వార్డులో ఎస్సీల ఓట్లే ఉండగా, బీసీలకు రిజర్వేషన్ కేటాయించారని ఆవేదన వ్యక్తంచేశారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం అజ్మీరాతండాలోని మొత్తం 781 ఓట్లలో 717 ఎస్టీ ఓట్లు ఉన్నప్పటికీ బీసీలకు సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని దేవ్లాతండా, బెట్టెతండాల్లో సర్పంచ్ స్థానాలను జనరల్‌కు కేటాయించారు. అత్యధికంగా గిరిజనులు ఉన్న శూన్యంపహాడ్, మీగడంపహాడ్ తం డాలను బీసీ జనరల్‌కు కేటాయించడంతో పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శూన్యంపహడ్లో 1,546 ఓట్లు ఉండగా, 1,415 ఓట్లు గిరిజనులవే. దీనిని బీసీ జనరల్‌కు కేటాయించారు.
మీగడంపహాడ్తండాలో 855 ఓట్లలో 838 ఓట్లు గిరిజనులవే. బెట్టెతండాలో 1,430 ఓట్లలో 1,424 ఓటు ్లగిరిజనులవే కాగా సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దేవ్లాతండాలో 513 ఓట్లలో 506 ఓట్లు గిరిజనులవి. దీనిని జనరల్‌కు కేటాయించడంపై మండిపడుతున్నారు. మోతె మం డలం రావికుంటతండాలో సర్పంచ్ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 949 ఓట్లలో కేవలం 3 ఓట్లు ఉన్న ఓసీలకు రిజర్వేషన్‌పై మండిపడుతున్నారు. ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.