ధర్మారం, జూలై 30 : సజీవ దహనమైన ఓ వ్యక్తికి స్నేహితులే అంత్యక్రియలతో పాటు కర్మకాండ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులు సైతం రాకపోయినా అన్నీ తామై కార్యక్రమాలను పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన గాలిపల్లి అశోక్ కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ రాత్రి సజీవ దహనమయ్యాడు. 27వ తేదీన మృతదేహానికి కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత గ్రామానికి తీసుకువచ్చారు.
అంత్యక్రియలు నిర్వహించడానికి అశోక్ తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అతని స్నేహితులు ముందుకు వచ్చి చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ మద్దెల నర్సయ్య వ్యవహరించి అగ్గి పట్టారు. కాగా ఆదివారం గ్రామ శివారులోని సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద అశోక్ చిత్రపటం వద్ద నివాళులర్పించి పెద్దకర్మ నిర్వహించారు. ఈ విషయం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.