హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): మార్క్ఫెడ్ మక్కల విక్రయంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. టెండర్లను దక్కించుకొన్న బిడ్డర్లు మక్కలు ఎత్తేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. ‘మీ మక్కలు మాకొద్దు… డబ్బులు చెల్లించినా వాటిని తీసుకెళ్లలేం’ అని మార్క్ఫెడ్ అధికారులకు విన్నవించుకుంటున్నారు. టెండర్లలో ఎక్కువ ధర కోట్ చేశామని, కానీ మార్కెట్లో ధర పడిపోయిందని, ఇప్పుడు వీటిని తీసుకుంటే తమకు నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. అందుకే టెండర్లను రద్దు చేయాలని వేడుకొంటున్నట్టు తెలిసింది. ఒకవేళ రద్దు చేయడానికి వీలులేని పక్షంలో కనీసం తమకు ఇచ్చే సేల్ కన్ఫర్మేషన్ లెటర్లను ఆలస్యంగా జారీచేయాలని కోరుతున్నట్టు తెలిసింది.
ఈ మేరకు ఇప్పటికే బిడ్డర్లంతా మార్క్ఫెడ్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అయితే, అధికారులు మాత్రం తమ చేతిలో ఏమీ లేదని, టెండర్లు పూర్తయి, కేటాయించిన తర్వాత తామేమీ చేయలేమని చెప్తున్నట్టు తెలిసింది. దీంతో బిడ్డర్లంతా ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. బుధవారం కరీంనగర్, జగిత్యాల పర్యటనకు వెళ్లిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవించేందుకు బిడ్డర్లంతా కూడగట్టుకొని అక్కడికి వెళ్లడం గమనార్హం. ఇలా టెండర్ నుంచి తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల మార్క్ఫెడ్ 10.98 లక్షల టన్నుల మక్కజొన్నలను మూడు విడతల్లో వేలం ద్వారా విక్రయించింది. మొదటి విడత వేలంలో టన్ను ధర రూ. 25,192 రాగా, రెండో విడతలో రూ.25,329, మూడో విడతలో రూ.25,594 ధరను బిడ్డర్లు కోట్ చేశారు.