ఏదైనా కంపెనీకి నిధులను చెల్లించాలంటే చట్టబద్ధంగా కార్మిక శాఖ హెడ్ అకౌంట్ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయాలి. అయితే, ఈ కుంభకోణంలో హెడ్ అకౌంట్ నుంచి కాకుండా వేరొక ఖాతాల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు మళ్లించారు. అంతేకాదు, బోర్డులోని నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రూ.250 కోట్లు రుణం తీసుకొని నేరుగా పరపతిలేని కంపెనీలకు చెల్లించారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కాంగా బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : ‘కార్మికుల చెమట.. పెద్దలకు మూట’ పేరుతో గురువారం ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కార్మిక శాఖలో జరిగిన ఈ బీమా కుంభకోణంపై నిర్మాణ రంగ కార్మికులు భగ్గుమంటున్నారు. లోపభూయిష్టంగా టెండర్ల ప్రక్రియను చేపట్టి పరపతిలేని ప్రైవేటు కంపెనీకి రాత్రికి రాత్రే రూ.346 కోట్లు మళ్లించడంలో అసలు సూత్రధారి సీఎంవో ప్రత్యేక అధికారి కాగా, పాత్రధారి కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ బీమా సొమ్మును స్వాహా చేయడానికి ఈ స్కామ్ సూత్రధారులు ఎంచుకొన్న మార్గం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘నమస్తే తెలంగాణ’ పరిశోధనలో ఆ తంతు కూడా బయటపడింది. ఏదైనా కంపెనీకి నిధులను చెల్లించాలంటే చట్టబద్ధంగా కార్మిక శాఖ హెడ్ అకౌంట్ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయాలి. అయితే, ఈ కుంభకోణంలో హెడ్ అకౌంట్ నుంచి కాకుండా వేరొక ఖాతాల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు మళ్లించారు. అంతేకాదు, బోర్డులోని నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రూ.250 కోట్లు రుణం తీసుకొని నేరుగా పరపతిలేని కంపెనీలకు చెల్లించారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కాంగా బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్తున్నారు.
లోపభూయిష్ట టెండర్లతో కాంట్రాక్ట్‌ను దక్కించుకొన్న ‘క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్’ కంపెనీకి నిధుల చెల్లింపుల్లోనూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, బోర్డు తాత్కాలిక చైర్మన్ దాన కిశోర్ నిబంధనలను ఉల్లంఘించారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి, కార్మిక శాఖకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా కార్మిక శాఖ హెడ్ అకౌంట్ నుంచి జరగాల్సి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు చట్టబద్ధమే అయితే హెడ్ అకౌంట్ నుంచి నిధులు చెల్లించాలి. అటువంటి చెల్లింపులకే చట్టబద్ధత ఉంటుంది. కానీ, దాన కిశోర్ ఈ విషయంలో చట్ట విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు నిధులు మళ్లించినట్ట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం ఆయన పర్యవేక్షణలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.250 కోట్లు రుణం తీసుకున్నట్టు సమాచారం. ఈ డబ్బునే ‘క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్’ ఖాతాల్లోకి మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
అంతేకాదు, రూ. 250 కోట్లను రుణంగా తీసుకోవడానికి కార్మికులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కార్మికుల నుంచి వసూలు చేసిన ప్రీమియం డబ్బులను భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పలు యూనియన్ బ్యాంకు శాఖల్లో 130 ఫిక్స్డ్ డిపాజిట్లుగా జమ చేసింది. దాని విలువ రూ 278.46 కోట్లుగా ఉన్నది. దానకిశోర్ ఈ డిపాజిట్లను తనఖా పెట్టి రూ.250 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ మేరకు గత జూలై 19న రూ.250 కోట్ల రుణం కోరుతూ కార్మిక శాఖ నుంచి యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా-కోఠి ప్రాంతీయ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకోసం యూనియన్ బ్యాంకు బ్రాంచీల్లో ఉన్న రూ.278.46 కోట్ల విలువైన 130 ఎఫ్డీలను తనఖాగా పెట్టుకొని రూ.250 కోట్లు రుణం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ఆర్బీఐ నిబంధనల ప్రకారం వడ్డీని కూడా చెల్లిస్తామని కార్మిక శాఖ సంక్షేమ బోర్డు కార్యదర్శి నుంచి ప్రతిపాదన లేఖ పంపారు. ఇక్కడ లేఖ రాసింది బోర్డు కార్యదర్శి పేరుతోనైనా..కథ మొత్తం నడిపింది దాన కిశోర్ అని కార్మిక శాఖ ఉద్యోగులు చెప్తున్నారు. ప్రాతిపాదన పంపిన రెండు రోజుల్లోనే యూనియన్ బ్యాంకు రుణం మంజూరుచేసినట్టు సమాచారం. మంజూరైన రుణాన్ని నేరుగా అదే నెల 24న ప్రైవేటు కంపెనీ ఖాతాలోకి మళ్లించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఎఫ్డీలను తనఖాగా పెట్టి రుణంగా తీసుకొన్న రూ.250 కోట్లను ‘క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్’ కంపెనీ ఖాతాలోకి, మరో రూ. 96.46 కోట్లను ‘హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఖాతాలోకి కార్మిక శాఖ బదిలీ చేసింది. రెండు కంపెనీలకు కలిపి మొత్తంగా రూ.346.46 కోట్లను చెల్లించింది. ఈ ప్రక్రియ జరిగి 48 రోజులైంది. కానీ ఇప్పటివరకూ ఆయా కంపెనీలు నియమ నిబంధనలు రూపొందించలేదు. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 15 రోజుల్లోగా పాలసీదారులకు గైడ్‌లైన్స్ అందుబాటులోకి రావాలి. కానీ, అలా జరుగలేదు. ఇక, బీమా కార్యకలాపాలు సంక్షేమ బోర్డు ఆధీనంలో ఉన్నప్పుడు పాలసీదారులు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే వాళ్లు. ఈ అప్లికేషన్ కార్మిక సహాయక అధికారి లాగిన్లోకి వెళ్లేది. అక్కడి నుంచి క్లెయిమ్స్ అప్రూవల్ ప్రక్రియ ప్రారంభం అయ్యేది. కానీ, ఇప్పుడు బీమా నిర్వాహణ బాధ్యత ట్రెయిల్ బ్లేజర్ అనే బ్రోకర్ కంపెనీ చేతిలోకి వెళ్లింది. దీంతో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? ఎలా ఐప్లె చేసుకోవాలి? ఎవరు ప్రాసెస్ చేస్తారు? వెరిఫికేషన్ అథారిటీ ఎవరిది? దరఖాస్తు సమయంలో ఇబ్బందులు తలెత్తితే ఎవరిని కలవాలి? అనే విషయాలు బ్రోకర్ కంపెనీ ఇప్పటివరకూ ప్రకటించలేదు. దీంతో కార్మికులు ఆందోళనలో పడ్డారు.
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడక ముందు కార్మికుని కుటుంబంలో పెండ్లి కానుక, ప్రసవ సహాయం కింద రూ.5 వేల చొప్పున ఇచ్చేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పెండ్లి కానుక, ప్రసవ సహాయాన్ని రూ.30 వేల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకొని అమలు చేశారు. అంతేకాదు, దరఖాస్తు చేసుకున్న 14 రోజుల నుంచి 25 రోజుల లోపు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ డబ్బు జమ అయ్యేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాలు అటకెక్కాయనే చెప్పాలి. దీన్ని ధ్రువపరుస్తూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 42,887 పెండ్లి కానుక, ప్రసవ సహాయం దరఖాస్తులు వచ్చాయి. వచ్చినవన్నీ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నట్టు సమాచారం. విచిత్రం ఏమిటంటే వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడానికే ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో ఉన్న ఈ అధికారి.. లాగిన్ డెస్క్‌లోకి దరఖాస్తు వెళ్లిందంటే ఇక అంతే సంగతులు అని బాధితులు చెప్తున్నారు.
ఇక్కడ ఇంకో మోసం కూడా జరుగుతున్నది. ైక్లెయిమ్లు ఇవ్వకపోతే.. ఇవ్వడం లేదని చెప్పాలి. లేదా దరఖాస్తును పెండింగ్‌లో పెట్టాలి. లేదా రిజెక్ట్ చేయాలి. కానీ, ఎక్కువమంది దరఖాస్తుదారుల కంప్యూటర్ స్టేటస్‌లో ఫైల్ అప్రూవల్ అని చూపిస్తున్నది. కానీ, ఖాతాల్లోకి మాత్రం డబ్బులు రావడంలేదని బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంటే, అప్రూవల్‌గా చూయించిన లబ్ధిదారుల డబ్బు ఎక్కడికి వెళ్తుందన్న ప్రశ్న వస్తున్నది. ఇలాంటి బాధితులు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్నట్టు ‘నమస్తే తెలంగాణ’ దృష్టికి వచ్చింది. పైగా పెండ్లి కానుక, ప్రసవ సహాయం, అంత్యక్రియల సహాయం తదితర పాలసీలను ఏ బ్యాంకుకు ఇచ్చారో కూడా పేర్కొనలేదు. అంటే ఈ పథకాలు ఉన్నాయా? ఉంటే కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం రావడంలేదు.
కార్మికుల సొమ్మును ప్రైవేటు కంపెనీలకు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం భవన కార్మిక సంక్షేమ పథకాలకు మంగళం పాడిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ మరణాలు, ప్రమాద మరణాలు, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం, ప్రసవ సహాయం, పెండ్లి కానుక, అంత్యక్రియల సహాయం తదితర ైక్లెయిమ్లు అన్నీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా 53,940 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండున్నర ఏండ్లుగా ఈ దరఖాస్తులను అటకెక్కించారు. వీటి మొత్తం విలువ రూ.321.95 కోట్లు. ఈ పెండింగ్ దరఖాస్తులు ఇలా ఉండగా.. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ హడావుడిగా రుణం తీసుకొని మరీ ప్రైవేటు సంస్థలకు దాన్ని అప్పగించారు. ఆ నిధులతోనే పాత ైక్లెయిమ్లను క్లియర్ చేసి ఉంటే 53 వేల కుటుంబాలకు లబ్ధిజరిగేదని ఎన్హెచ్ఆర్సీ సంస్థ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ద్యాగటి హరీశ్.. కార్మిక శాఖ ముఖ్యకార్శి దానకిశోర్‌ను కలిసి వివరించినట్టు సమాచారం. కానీ, దాన కిశోర్ ఆయన మాటను పరిగణనలోకి తీసుకోలేదని ఆ సంస్థ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎఫ్డీలు పెట్టి లోన్ తీసుకోవడంతో మరో కొత్త సమస్య కూడా వస్తుందని కార్మిక సంఘాలు అంటున్నాయి. సంక్షేమ బోర్డు ఎఫ్‌డీల నుంచి వచ్చే వడ్డీ రాబడి, లోన్‌కు అయ్యే వడ్డీరేటుకే మళ్లిస్తారని, అటువంటప్పుడు సంక్షేమ పథకాలు నడపడం సాధ్యం కాదని వారు అంటున్నారు. ఎఫ్డీ వడ్డీ సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలుచేయాలని బోర్డు నిబంధనల్లో ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు పథకాల మనుగడ ప్రశ్నార్థకం అయిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నిబంధనల ప్రకారం.. సంక్షేమ బోర్డులో ఎటువంటి సంస్కరణలు చేపట్టినా.. బోర్డు మీటింగ్‌లో ఆయా అంశాలను ఎజెండగా పెట్టాలి. కొత్త సంస్కరణలపై లోతుగా చర్చించిన తరువాతే తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బోర్డు ఖాతాల నుంచి నిధుల విడుదల, ఖర్చు చేయాలంటే కచ్చితంగా బోర్డు కమిటీ నుంచి బడ్జెట్ అనుమతి తీసుకోవాలి. బోర్డు బడ్జెట్ కమిటీకి కార్మిక శాఖ మంత్రి చైర్మన్‌గా, లేబర్ శాఖ కమిషనర్ కన్వీనర్‌గా, ముఖ్య కార్యదర్శి ఎక్స్అఫీషియో సభ్యునిగా వ్యహరిస్తారు. వీరితోపాటు కేంద్ర కార్మిక శాఖ ప్రతినిధి కూడా కమిటీలో ఉంటారు. ఈ కమిటీ ఆమోదం పొందిన తరువాతే సంస్కరణలు అమలుచేయాలి. నిధులను విడుదల చేయాలి. ఈ నిబంధనలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కార్మిక శాఖ ఇన్చార్జి కమిషనర్, ముఖ్య కార్యదర్శి అయిన దాన కిశోర్ మీదనే ఉన్నది. కానీ, అటువంటివేమీ జరుగలేదు. బీమా పథకం నుంచి బోర్డు తప్పుకొని ప్రైవేటుకు బాధ్యతలు అప్పగించే వ్యవహారాన్ని బోర్డు సమావేశంలో కనీసం ఎజెండగా కూడా పెట్టనట్టు సమాచారం. అలాగే బ్యాంకు నుంచి రుణాలు స్వీకరించడం, రూ.346 కోట్ల నిధుల చెల్లింపులపై బడ్జెట్ ఆమోదం లేదని విశ్వసనీయంగా తెలిసింది.