మంథని రూరల్(ముత్తారం), సెప్టెంబర్ 28: ఓ మహిళ మెడలోంచి పుస్తెలతాడు దొంగిలించిన వ్యక్తి, పారిపోతూ ప్రమాదవశాత్తు శివారులోని చెరువులో పడి మరణించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సర్వారం గ్రామంలో గురువారం జరిగింది. పెద్దపల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. రామగిరి మండలం బేగంపేటకు చెందిన బొంతల రాజ్‌కుమార్ (36) ముత్తారం మండలం మచ్చుపేటలో కంచర్ల పుష్పలత ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశాడు. అక్కడి నుంచి సర్వారం చేరుకొని కిరాణా దుకాణానికి వెళ్లాడు.
షాపులో ఉన్న సజ్జనపు మమతను పెట్రోల్ కావాలని అడిగాడు. దీంతో పెట్రోల్ ఇస్తుండగా ఆమె మెడలోని పుస్తెల తాడు తెంపాడు. ఆమె కేకలు వేయడంతో రాజ్‌కుమార్ బైక్ అక్కడే వదిలేసి పారిపోతూ మైదంబండ చెరువులో పడిపోయాడు. చెరువులోని బురద ఊబిలో చిక్కుకొని మరణించాడు. రాజ్‌కుమార్‌కు భార్య, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.