ఎలాగూ జీవితఖైదు పడటం ఖాయం.. రెండు రోజుల్లో జైలుకెళ్లాల్సిందే.. ఈ లోపు మళ్లీ తప్పు చేస్తే పోయిదేముందిలే అనుకున్నాడో పాత నేరస్తుడు. బరితెగించి ఓ మహిళను కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అత్యాచారం చేశాడు. అనంతరం చిత్రహింసలు పెట్టి చంపేశాడు. మెదక్ జిల్లాలో కూలీ పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లి హత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఈ సంచలన విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీర్ నాయక్ సంగారెడ్డి జిల్లా అంబోజిగూడలో నివాసం ఉంటున్నాడు. గతంలో మెదక్‌లో ఓ మహిళను అత్యాచారం చేసి చంపేశాడు. దీనితో పాటు ఫకీర్ నాయక్‌పై మరో ఏడు కేసులు ఉన్నాయి. ఇందులో హత్యాచారం కేసు విచారణ ఇటీవల ముగిసింది. అక్టోబర్ 13వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. అందులో తనకు ఎలాగూ జీవిత ఖైదు పడటం ఖాయమని తెలిసిపోయింది. ఎలాగూ జీవిత ఖైదు పడటం ఖాయం కాబట్టి జైలుకు వెళ్లేలోపు తన కోరికను తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం (అక్టోబర్ 10) ఉదయం మెదక్‌లోని కూలీల అడ్డా వద్ద పని కోసం ఎదురుచూస్తున్న మెదక్ జిల్లా కొల్పారం మండలానికి చెందిన గిరిజన మహిళపై కన్నేశాడు. పని ఉందని మాయమాటలు చెప్పి ఆమెను బస్సులో ఏడుపాయల కమాన్ వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. అందుకు ఆ మహిళ నిరాకరించడంతో ఆమెను ఓ చెట్టుకు కట్టేసి వివస్త్రను చేసి అత్యాచారం చేశాడు. అనంతరం కర్ర, రాయితో ఆమెను కొట్టాడు. మహిళ చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
శనివారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ చుట్టుపక్కలఉన్న సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో మెదక్ బస్టాండ్ సమీపంలోని ఓ వైన్‌షాప్ వద్ద పాత నేరస్థుడు ఫకీర్ నాయక్‌ను పోలీసులు గుర్తించారు. అనుమానంతో మంగళవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నాడు. పాత కేసులో ఎలాగూ శిక్ష పడుతుందని తెలిశాకే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టానని ఫకీర్ ఒప్పుకున్నాడు.