Karimnagar | కరీంనగర్ రాంనగర్, సెప్టెంబర్ 15: కానిస్టేబుల్ తరహా దుస్తులు ధరించిన ఓ వ్యక్తి రోడ్డుపై విధులు నిర్వర్తిస్తున్నట్టు నటించాడు. అటుగా బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని ఆపి ఎస్సైని దించొస్తానని బైక్‌తో సహా ఉడాయించాడు. ఈ ఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాస్త్రీరోడ్లో జరిగింది. నగరంలోని ఫతేపురాకు చెందిన బొజ్జ శివం తన బుల్లెట్ వాహనంపై శాస్త్రీరోడ్డుపై వస్తుండగా.. అకడే కానిస్టేబుల్ తరహా దుస్తుల్లో విధి నిర్వహణలో ఉన్నట్టుగా నటించిన వ్యక్తి తనను ఆపాడు. సమీపంలో తమ ట్రాఫిక్ ఎస్సై విధులు నిర్వర్తిస్తున్నారని, ఆయనను దించొస్తానని, బైక్ ఇవ్వాలని అడిగాడు.
పోలీస్ యూనిఫాంలో ఉండటంతో ఆ వ్యక్తిని నమ్మిన శివం తన బుల్లెట్ వాహనాన్ని ఇచ్చాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి హుటాహుటిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు చెప్పాడు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు తమ కానిస్టేబుల్ ఎవరూ అకడ విధినిర్వహణలో లేరని చెప్పడంతో వెంటనే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ యూనిఫాంలో వచ్చిన వ్యక్తి తన బైక్ ఎత్తుకెళ్లాడని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ సరిలాల్ తెలిపారు.