న్యూస్‌నెట్‌వర్క్, జూలై 5 (నమస్తేతెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా ఉన్న బొగ్గుగనులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వామపక్షాలు, కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు శుక్రవారం సింగరేణి కారిడార్‌లోని ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట , హైదరాబాద్ లక్డీకాపూల్ సింగరేణి భవన్ ముందు మహాధర్నా నిర్వహించాయి. బొగ్గుగనుల ప్రైవేటీకరణను మానుకోవాలని, బొగ్గుబ్లాకుల వేలాన్ని ఆపాలని, ఆ గనులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశాయి. వామపక్ష కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, ఐఎఫ్టీయూ నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, టీడీపీ ప్రతినిధులతోపాటు ఆల్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా శాఖల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ముందు జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ నాయకులు పశ్యపద్మ, ఈటీ నర్సింహ, అంజయ్యనాయక్, సీపీఎం నాయకులు డీజీ నరసింహారావు, సాగర్, ఎం శ్రీనివాస్, గుమ్మడి నరసయ్య (సీపీఐ మాస్‌లైన్), జేవీ చలపతిరావు, సాధినేని వెంకటేశ్వరరావు (సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ), ధర్మతేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బందిపోటు దొంగల్లాంటి కార్పొరేట్ అధిపతులతో మోదీ కుమ్మకై దేశ సంపదను విక్రయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ ఆస్తి, తెలంగాణ వెలుగు సింగరేణిని కూడా కార్పొరేట్ అధిపతులకు అప్పగించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
సీపీఎం నాయకులు డీజీ నరసింహారావు మాట్లాడుతూ.. సింగరేణి విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనేక అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకునే దాకా ఉత్తరాదిలో చేపట్టిన రైతు ఉద్యమ స్ఫూర్తితో బొగ్గుబ్లాకుల వేలాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ సంపదను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఆ పార్టీ ఎంపీ కిషన్‌రెడ్డికి బొగ్గు గనుల శాఖ మంత్రి పదవి అప్పగించి, తెలంగాణ బొగ్గును ఆయన చేతుల మీదుగానే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిస్తున్నారని దుయ్యబట్టారు. దీనిని అడ్డుకోవాల్సిన మంత్రి కిషన్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా హాజరవడం చూస్తే రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయన్న అనుమానాలు వస్తున్నాయని విమర్శించారు. వామపక్ష పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నేతలు ఎర్రజెండాలు పట్టుకొని ఆయా జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్లకు చేరుకున్నారు. అనంతరం కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు.