పాల్వంచ, నవంబర్ 19: ప్రేమించిన బాలికను పెండ్లి చేసుకునేందుకు తిరుపతికి తీసుకెళ్లిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, కుటుంబ సభ్యులు వారి ఆచూకీ తెలుసుకొని తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా భయపడి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బస్సు ఢీకొనడంతో ప్రాణాలు వదిలాడు.
వివరాలు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన గోవిందు సాయికృష్ణ (21) అనే యువకుడు ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. పెండ్లి చేసుకుందామని చెప్పి పది రోజుల క్రితం ఆ బాలికను తిరుపతికి తీసుకెళ్లాడు. బాలిక అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రేమికులు తిరుపతిలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు, రెండు కుటుంబాలకు చెందిన బంధువులు వారిని తీసుకొచ్చేందుకు తిరుపతికి వెళ్లారు. గురువారం వారిని తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా రేణిగుంట వద్దకు రాగానే సాయికృష్ణ మూత్రానికి వెళ్తానని చెప్పి కారు దిగి పారిపోతున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు సాయికృష్ణ మృతదేహాన్ని శుక్రవారం పాల్వంచలోని నివాసానికి తీసుకొచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.