హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అనాథలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం సమగ్రచట్టం రూపొందించే పనిలో నిమగ్నమైంది. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం రూ పొందించిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశం సుదీర్ఘంగా చర్చించి అనాథలకు ఆత్మీయస్పర్శను అందించింది. మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు అనాథలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘ కసరత్తు చేశారు. అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తి స్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీకార్డులు జారీచేయడం, ఈ కార్డు ఉంటే ఆదాయ, కుల, ఇతర ధ్రువీకరణ పత్రాలకు మినహాయింపు ఇవ్వడం, ముస్లింలలో అనాథలను చేరదీస్తున్న యతీమ్ఖానాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని రావడం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించింది.
ప్రభుత్వ బిడ్డలుగా పరిగణించే అనాథల కోసం చేసే ఖర్చును గ్రీన్‌చానల్‌లో పెట్టాలని, దీనికి కేటాయించిన నిధు లు ఆ సంవత్సరం ఖర్చు కాకపోతే మరుసటి ఏడాదికి క్యారీఫార్వడ్ చేసి శాశ్వత ఆర్థిక భద్ర త కల్పించే విధంగా విధానాల రూపకల్పన జరగాలని సమావేశం నిర్ణయించినట్టు సమాచారం. దేశానికే మార్గదర్శనం చేసే విధంగా అనాథలకు అండగా ఉండే విధాన రూపకల్పన చేసి వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు వెల్లడించడం విశేషం.