న్యూఢిల్లీ : రాజద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. బదిలీ అంశంపై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఐపీసీకి బదులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టం గత కాలం నుంచి వర్తించదు కాబట్టి ఐపీసీ సెక్షన్ 124ఏపై విచారణ అవసరమేనని తెలిపింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కేంద్రం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మాట్లాడుతూ, వలస పాలకులు అమల్లోకి తెచ్చిన ఐపీసీ, సీఆర్పీసీ, సాక్ష్యాధార చట్టాలను, రాజద్రోహం నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని, ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడాన్ని వాయిదా వేయాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది.