హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ నెలలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రతి పరీక్షాకేంద్రంలో పూర్తిస్థాయి సిట్టింగ్ స్కాడ్ (అబ్జర్వర్)ను నియమించాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ, పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో స్కాడ్‌ల ద్వారా పరీక్షాకేంద్రాలపై గట్టి నిఘా పెంచుతారు. గతంలో ఫ్లయింగ్ స్కాడ్‌ను నియమించి, అడపాదడపా తనిఖీలు నిర్వహించేవారు. కానీ, ఈ ఏడాది ప్రతి పరీక్ష కేంద్రం వద్ద అబ్జర్వర్ నియామకంతోపాటు నలుగురు పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేస్తారు. పరీక్షాకేంద్రాలు నో సెల్‌ఫోన్ జోన్లుగా అమలుపరుస్తారు. ఒక్క అబ్జర్వర్‌ను మాత్రమే సెల్‌ఫోన్‌తో అనుమతించినా.. దానిని పరీక్షహాల్లోకి తీసుకెళ్లకూడదు. విద్యార్థుల హాజరు సమాచారం చేరవేసేందుకు పరీక్ష మొదలైన 15 నిమిషాల వరకే సెల్‌ఫోన్‌ను వాడేందుకు అనుమతిస్తారు. ఎంసెట్‌తో పాటు ఎడ్‌సెట్, లాసెట్, ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్ పరీక్షలన్నింటికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
ఎంసెట్‌కు అదనంగా 50 వేల దరఖాస్తులు
టీఎస్ ఎంసెట్‌కు ఈ ఏడాది అదనంగా 50 వేల దరఖాస్తులు వచ్చినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. నిరుడు 2.66 లక్షల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 3.20 లక్షల దరఖాస్తులొచ్చినట్టు వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఎంసెట్‌కు దరఖాస్తుల వెల్లువతో కొత్తగా 28 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. అగ్రికల్చర్, మెడికల్‌కు 113, ఇంజినీరింగ్‌కు 137 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పరీక్షలకు ఆలస్యమైతే అనుమతించేది లేదని స్పష్టంచేశారు. ఒక్కొక్కరోజున లాసెట్‌ను, ఎంసెట్‌ను మూడు సెషన్లలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.ఈసెట్‌ను ఈ ఏడాది ఒక్క పూటలో పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్‌రావు, ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్, కోకన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్, పీజీఈసెట్ కన్వీనర్ రవీంద్రారెడ్డి, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మీ, ఎడ్‌సెడ్ కో కన్వీనర్ ప్రొఫెసర్ పారుపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.