హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో నూతన పోకడలు, మార్పులను ఆకలింపు చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లో కీలక మేధోమథనం జరననున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) నేతృత్వంలో తొలిసారి హైదరాబాద్‌లో ఆలిండియా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ చైర్మన్ల సదస్సును నిర్వహించనున్నారు. నీపాలో అంతర్భాగమైన సెం టర్ ఫర్ పాలసీ రిసెర్చ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఉన్నత విద్యామండలి సంయుక్తంగా రెండు రోజుల సదస్సును నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వెల్లడించారు.మాసబ్‌ట్యాంక్‌లోని మండలి కార్యాలయంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టన్ ఎన్ శ్రీనివాస్‌రావుతో కలిసి ఆయన మీడియాతో సదస్సు వివరాలను వెల్లడించారు. 2014లో ఏర్పాటైన ఈ విభాగం తొలిసారి ఢిల్లీ బయట హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నదని చెప్పారు. నీపా వైస్‌చాన్స్‌లర్ సుదాంశు భూష ణ్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సదస్సు ప్రారంభంలో పాల్గొంటారని వివరించారు. 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. ఉన్నత విద్యలో సమకాలీన సంసరణలను ముందుకు తీసుకెళ్లటంపైనే ప్రధాన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.
వర్సీటీలు, విద్యాసంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిధులను నిలిపివేసింది. నాలుగేండ్లుగా రూపాయి విడుదల చేయటం లేదు. కానీ, మార్గదర్శకాలతో పెత్త నం చెలాయిస్తున్నది. ఈ నేపథ్యంలో సదస్సులో ఈ అంశంపై చర్చించే అవకాశాలున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.