ఖలీల్‌వాడి/ఆర్మూర్‌టౌన్, మే 19: తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అంటే విజనరీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అంటే ప్రిజనరీ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ ధరిత్రి మురిసేలా చరిత్రకెక్కిన ఆనవాళ్లు అని అభివర్ణించారు. కేసీఆర్ ఆనవాళ్లు తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్లు అని, తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ అనే మూడక్షరాలు ప్రజల మనోఫలకంపై చెరగని శిలాక్షరాలని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డివి తెలంగాణ పరువు తీస్తున్న అవినీతి పరవళ్లు అని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనచూసి ప్రపంచ అందగత్తెలు పరవశించారని, కేసీఆర్ అద్భుత కట్టడాలు ప్రపంచానికి తెలిసేలా చేసిన రేవంత్‌రెడ్డికి థ్యాంక్స్ అని చెప్పారు. సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్, టీ-హబ్‌ని ఎవరు కట్టారని విశ్వసుందరీమణులు అడగలేదా? అని ప్రశ్నించారు. యాదాద్రి దేవస్థానం కేసీఆర్ ఆధ్యాత్మిక ప్రస్థానానికి ప్రతీక అని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, దళిత బంధు కేసీఆర్ సాధించిన అద్భుతమైన విజయాలని గుర్తుచేశారు. 2013-14 వరకు కోటీ 55 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో 2022-23 నాటికి 2 కోట్ల 29 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచిన చరిత్ర కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. ఆహార పంటల ఉత్పత్తికి సంబంధించి 2013-14లో 2.25 కోట్ల టన్నులు పండిస్తే, 2023-24 లో 5 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించడం కేసీఆర్ విజన్‌కు నిదర్శనమన్నారు.
కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, కరెంట్ నుంచి కంటి వెలుగు వరకు అభివృద్ధి జాడలన్నీ కేసీఆర్ ఆనవాళ్లే అని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఒక స్కీము, ఒక డ్యాం ప్రారంభించలేదు, కూల్చివేతలు, కాల్చివేతేలు, పేల్చివేతలు తప్ప చెప్పుకోవడానికి ఏమున్నాయని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ధనదాహానికి బలైన మూసీ పేద బతుకులు, హెచ్‌సీయూ భూముల స్వాహాకు కుట్రలు, 420 హామీలు, ఆరు గ్యారెంటీల మోసాలను సందరీమణులకు వివరించాలని ఎద్దేవాచేశారు.