కోటగిరి, సెప్టెంబర్ 15: మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొల్లూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు సుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కొల్లూర్‌కు చెందిన నిమ్మల అంజని (45)కి ఘన్‌పూర్‌కు చెందిన పోశెట్టితో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు భర్తపై అంజని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.
అయినా పోశెట్టిలో మార్పు రాలేదు. మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవకు దిగేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె జూలైలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అంజని అదృశ్యమైనట్టు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంటికి తిరిగివచ్చింది. పోశెట్టి మళ్లీ మద్యం తాగి గొడవకు దిగేవాడు. గ్రామ పెద్దలు నచ్చజెప్పినా పోశెట్టి తీరులో మార్పురాలేదు. బుధవారం రాత్రి కూడా మద్యం తాగొచ్చిన పోశెట్టి.. భార్యతో గొడవకు దిగాడు. కోపంతో విచక్షణ కోల్పోయిన పోశెట్టి అంజనిని గొడ్డలితో నరికాడు. కూతురు వెంటనే బంధువులకు సమాచారమిచ్చింది. వారు వచ్చి చూసేసరికి అంజని మరణించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోశెట్టిని అదుపులోకి తీసుకున్నారు.