హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా కోణంలో దివ్యాంగుల సంక్షేమానికి కోట్లాది నిధులు ఖర్చు చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. లూయిస్ బ్రెయిలి జయంతి సందర్భంగా హైదరాబాద్ మలక్ పేట దివ్యాంగుల సహకార సంస్థ కార్యాలయంలో అత్యంత ఎత్తయినా లూయిస్ బ్రెయిలి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలి అని పేర్కొన్నారు. కంటి చూపు లేని వారికి లిపిని అందించిన ఘనత లూయిస్ బ్రెయిలికి దక్కిందన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తన అంధత్వాన్ని జయించాడని, అంధుల కోసం బ్రెయిలి లిపిని రూపొందించారాని చెప్పారు. ఏ రాష్ట్రం లో లేని విధంగా దివ్యాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ న్నామని చెప్పారు.రాష్ట్రంలోని 5 లక్షల 51 వేల మంది దివ్యాంగులకు సంవత్సరానికి రూ. 2000 కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా ఉమ్మడి పాలనలో 30 శాతం సబ్సిడీతో మాత్రమే సహాయ ఉపకరణాలు అందేవని, నేడు వందశాతం సబ్సిడీతో ఉచితంగా అనేక సహాయ ఉపకరణాలను అందిస్తున్నామని తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమ శాఖ బడ్జెట్ను రూ. 20 కోట్ల నుంచి రూ. 83 కోట్లకు పెంచారని వెల్లడించారు.పలువురు అంధ విద్యార్థులు, ఉద్యోగులను మంత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహామూద్ అలీ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి, దివ్యాంగుల సహకార సంస్థ జేఎండీ శైలజ, జీఎం ప్రభంజన్ రావుతో పాటు పలువురు వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.