పాలకవీడు, ఆగస్టు 3 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. తీవ్ర జ్వరంతో అవస్థ పడుతున్న ఆయన్ని బలవంతంగా సీఎం రేవంత్రెడ్డి సభకు తీసుకువెళ్లవడం వల్లే చనిపోయాడని బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు యరగొర్ల గంగయ్య (41) పాలకవీడు ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండింట్గా పనిచేస్తున్నారు.
గతంలో మేడారం పాఠశాలలో పని చేయగా, ఇటీవలే పదోన్నతిపై పాలకవీడు వచ్చారు. గంగయ్య రెండ్రోజులుగా జ్వరం తో బాధపడుతున్నారు. విద్యాశాఖ అధికారులు సీఎం మీటింగ్కు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించడంతో శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సభకు వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకొన్నాడు. మీటింగ్ హాజరైన ఉపాధ్యాయులకు శనివారం ఓడీ ఇవ్వడంతో ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకున్నాడు. జ్వరంతో బాధపడుతున్న గంగయ్యకు సాయంత్రం గుండెపోటు రావడంతో చనిపోయాడు.