Ponnam Prabhakar | చిగురుమామిడి, నవంబర్ 29 : “సార్.. మాకు రైతు రుణమాఫీ కాలే.. రైతుబంధు రాలే.. ఎప్పుడిస్తారు?” అని ఓ మహిళ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో శుక్రవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రి పొన్నం మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో మంత్రి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండగా చిగురుమామిడికి చెందిన బెజ్జంకి భాగ్యమ్మ లేచి “సార్.. మాకు రైతు రుణమాఫీ కాలే.. రైతుబంధు రాలే..” అని తెలిపింది.
దీంతో స్పందించిన మంత్రి “మేం ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలకు నువు తల ఊపలేదమ్మా.. వీటిని రేపటి నుంచి ఇస్తాం” అని సమాధానం దాటవేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరలో అమలు చేస్తామని చెప్పారు.