పాడుబడ్డ బాత్రూంలో రైతుల ఆధార్ కార్డులు, పాస్ బుక్ జిరాక్స్‌లు పడివేత..
పోలీసుల పహారాలో యూరియా పంపిణీ..
తొర్రూర్ పిఎసిఎస్ సందర్శించిన ఆర్డిఓ గణేష్, డిఎస్పి కృష్ణ కిషోర్
Mahabubabad | తొర్రూరు ,ఆగస్టు 20 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరత రైతుల ఆవేదనకు దారి తీసింది. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండే రైతులు అమ్మపురం రోడ్డులోని పిఎసిఎస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు. అయితే గతంలో సమర్పించిన ఆధార్ జిరాక్స్ పత్రాలు కనబడకపోవడంతో వాటిని వెతికే క్రమంలో పక్కనే ఉన్న పాడుబడ్డ బాత్రూం వద్ద వదిలివేయబడ్డాయి. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌పై మండిపడ్డారు. యూరియా కొరతతో రెండు ఎకరాల రైతుకు కేవలం ఒకే బస్తా కేటాయించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక రైతు అధికారి కాళ్లు మొక్కాడు.
రైతులు మాట్లాడుతూ,“బిఆర్ఎస్ పాలనలో రైతులకు కావలసినంత యూరియా అందించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇంత అవమానకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది” అని వాపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు పిఎసిఎస్ వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్, ఆర్డీవో గణేష్, ఎమ్మార్వో శ్రీనివాస్, ఏవో రామ్ నరసయ్య, ఎస్సై గొల్లమూడి ఉపేందర్, మాజీ జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, పాకనాటి సునీల్ రెడ్డి, శ్రీరామ సుధీర్, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.