కరీంనగర్: జిల్లాలోని చొప్పదండి మండలంలో విషాదం నెలకొంది. పొలంలో పనిచేస్తున్న భార్యాభర్తలకు కరెంట్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందారు. పెద్దపల్లికి జిల్లా సుల్తానాపూర్ మండలం ఎలిగేడు గ్రామానికి చెందిన జాతరకొండ ఓదేలుకు చొప్పదండి మండలం వెదురుగుట్ట గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. భార్య రజితతో కలిసి ఓదేలు ఇవాళ ఉదయం పొలం పనులకు వెళ్లారు.
పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు గమనించక ప్రమాదవాశాత్తు ఓదేలు మందు కొడుతుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టి కిందపడి పోయాడు. భర్తను రక్షించేందుకు వెళ్లిన భార్య రజిత కూడా విద్యుదాఘాతానికి లోనై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.