ఆకాశమే అరుగులు భూ దేవరే గద్దెలు
సూర్యచంద్రులే గొడుగులు
గుడులు లేని తల్లులు
గురి తప్పని అడుగులు
కారు మబ్బులు కురవనపుడు
కారు పండి మురియనపుడు
అడవి తీర్చే ఆకలి కూడా
అరకొరగా మారినపుడు
కాయలు కసర్లు దుంపలు దూసవడ్లు
దుఃఖానికి దూపకెత్తినపుడు
బతుకే భారంగా మారి
ఉమ్మ నీరు కూడా ఉరితాడు అయినపుడు
కన్న పేగు కాటికి కాళ్ళు సాపే
కాలం ఎదురు నిలిచినపుడు.
వేసిన సాళ్లు, సల్లిన గింజలు
పొశిలోనే పొట్లిపోయినపుడు
పన్ను కట్టుమని
ఫరమాన్లు పరుగులు తీసినపుడు
ఎల్లీ ఎల్లక ఏదో తిని బతికే జీవులు
మనుషులం తప్ప, మా దగ్గర ఏం
లేదని మొర పెట్టినపుడు
బలవంతంగా శిస్తు చెల్లించమని
బాకులు దూసినపుడు
ఎంత బతిమిలాడినా
కరిగి కరుణించని రాతి గుండెలు
బాధలను ఎదుర్కొనేందుకే
బరి గీసిన బతుకులు
రాజ్యంతోని కొట్లాడి
రణరంగంలో ఒరిగిన వనజీవులు
సమ్మక్కా, సారలమ్మా!
పగిడిద్ద రాజు, గోవింద రాజు
పోరులో ఓడినా జంపన్నా !
దారికి దీపం, ఊరికి కాపల
ఇది రాచరికానికి
తెగల తెగువకు మధ్యన పోరాటం
ఇది శక్తినంత కూడదీసుకొని
యుక్తితో చెలరేగిన మాగానం.
కోళ్లు గొర్లు కొలిమి మంటను రాజేస్తున్నయి
కల్లు సారలు కత్తులు నూరుతున్నయి
ఆధిపత్యాన్ని అటకెక్కించే
ఆలోచనలకు ఆయువు పోస్తూ…
-కందుకూరి అంజయ్య
9490222201