మిత్రమా!
నేను నీలో ప్రవేశించిన క్షణం
నీ చలన పరిశ్రమకు బీజం
ఉదయించే బాల్యం
ఉద్రేక పిపాసతో యవ్వనం
కోరికలు తీరిన తీరంలో
ఆనందలోకాల గిలిగింతల్లో నాతో నీవు!
భారమైన బాధ్యతలను మోస్తూ
నిన్ను నీవు చెక్కుకుంటూ
అనుభవాకృతి దాల్చి
అనుభూతి పరిమళాలతో
నీకుగా నీవు పొందిన
జీవసారస్య మరందాన్ని
తనివితీరా ఆస్వాదిస్తూ నాతో నీవు!
నీ పరిష్వంగాన్ని వదిలి
నేను వెళ్లిన మరు క్షణం
చెరిగిపోయిన తల రాతలతో
నీదైన ఈ దేహం
శూన్యంలో బూడిద
నీ అంటును వదిలించుకుని
నీటితో ప్రక్షాళన చేసుకున్న బంధాలు
తమ దేహాల కోసం పరితపిస్తూ
తిరిగి ఆవాసాలను చేరుకుంటాయి
ఎప్పటికైనా మీ దేహాలన్నీ
మిగిలిపోయే జ్ఞాపకాలే!
నా ఉనికి ఉన్నంత వరకే
మీ ఆట, సయ్యాట!
మట్టి కుప్పల్లో చేరుతూ
తొలగని భ్రమలతో మీరు
మరో దేహాన్ని వెతుక్కుంటూ నేను!
క్షణికం మన ఈ బంధం
సత్యం తెలిసినా
తెలియనట్లు నడుస్తున్న
నట జీవితం!!
-ధూళిపాళ అరుణ
87123 42323