బూర్గంపహాడ్, జూన్ 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మం డలం మోరంపల్లి బంజరకు చెందిన మాజీ మావోయిస్టు రాయల వెంకటేశ్వర్లు జీవన స్థితిగతులపై డాక్యుమెంటరీ రానున్నది. వెంకటేశ్వర్లు జనజీవన స్ర వంతిలో కలిసిన తరువాత ఆయన జీవన స్థితిగతులు, ఆయనకు ప్రభుత్వం నుంచి మంజూరైన దళితబంధు సాయంపై ‘మాజీ మావోయిస్టు ఇంట్లో దళితబంధు వెలుగు’ అనే శీర్షికన మే 26న నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం పై బుధవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాలయం నుంచి అధికారులు రాయల వెంకటేశ్వర్లుకు ఫోన్ చేశారు.
ప్రదీప్ అనే అధికారి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి మీ వద్దకు డాక్యుమెంటరీ నిమిత్తం ఓ బృందం వస్తుంది. మీ జీవన స్థితిగతులు.. ప్రభుత్వం నుంచి అందిన దళితబంధు సాయంతో మీ ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై డాక్యుమెంటరీ తీసేందుకు మంత్రి కేటీఆర్ మీ అనుమతి కోసం ఫోన్ చేయమని చెప్పారు. మీరు సహకరించాలి’ అని కోరినట్టు వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో వెంకటేశ్వర్లు ఆనందంతో ఉప్పొంగిపోయాడు.