Power Cuts | కోల్సిటీ, జూన్ 5: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారు గోదావరి నదీ తీరాన హిందూ శ్మశాన వాటిక సమస్యల వలయంలో చిక్కుకున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఆ శ్మశాన వాటికలో కరెంటు లేక నిత్యం చీకట్లు అలుముకుంటున్నాయి. రామగుండం నగరపాలక సంస్థ ఆ శ్మశానవాటికను పట్టించుకోవడం మానేసింది.
దీంతో రాత్రివేళల్లో దహన సంస్కారాలు చేయాల్సి వస్తే సెల్ఫోన్ల వెళుతురు లేదా టార్చిలైట్లను ఉపయోగించాల్సి వస్తున్నదని స్థానికులు వాపోతున్నారు. రెం డురోజుల క్రితం ఓ వ్యక్తి చనిపోతే శ్మశాన వాటికకు తీసుకెళ్లిన బంధువులు నిశీధిలో సెల్ఫోన్ లైట్ల సాయంతో అష్టకష్టాలు పడు తూ దహన సంస్కారాలు పూర్తిచేశారు.
ఉచిత దహన సంస్కారాలకు మంగళం
పేదలకు ఉచిత దహన సంస్కారాల విషయంలోనూ రామగుండం నగరపాలక సంస్థ చేతులెత్తేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికలోని సిబ్బంది దహన సంస్కారాలకు కావాల్సినవన్నీ ఉచితంగా సమకూర్చేవారు. వాటి కి మున్సిపాలిటీ నుంచి వారికి బిల్లులు వచ్చే వి.
ప్రభుత్వం మారిన తర్వాత బిల్లులు ఇవ్వడం ఆగిపోయింది. దీంతో శ్మశాన వాటిక సిబ్బంది మృతుల కుటుంబసభ్యుల నుంచే 20 వేల నుంచి 30 వేల వరకూ వసూలు చేయడం పేదలకు భారంగా మారింది. ‘ఇంతకాలం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అభివృద్ధి పనులు చేపట్టలేదు. కోడ్ ముగిసింది కాబట్టి త్వరలోనే శ్మశాన వాటికలో వసతులు కల్పిస్తామని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.