హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కవ్వాల్ రిజర్వ్‌కు కొనసాగింపుగా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్, తాడోబా టైగర్ రిజర్వ్ మధ్య కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కానున్నది. పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో మొత్తం 1492 చదరపు కిలోమీటర్ల పరిధిలో కన్సర్వేషన్ రిజర్వ్ రూపుదిద్దుకోనున్నది.
సచివాలయంలో మంగళవారం జరిగిన స్టేట్‌బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ సమావేశంలో మంత్రి, చైర్మన్ కొండా సురేఖ సమక్షంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాము కాటు వల్ల జరిగే మరణాలకు నష్ట పరిహారం అందజేయాలన్న ప్రతిపాదనలపై సమావేశంలో చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. త్వరలోనే రాష్ట్రస్థాయి ఎకో టూరిజం పాలసీని రూపొందిస్తామని చెప్పారు.