మంచిర్యాల, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్పంచ్ ఎన్నికల్లో తమతో కలిసి రావడం లేదని కక్ష పెంచుకున్న కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకుడిపై కత్తితో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లిలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శెట్పల్లికి చెందిన కోరుకొప్పుల శ్రీనివాస్‌గౌడ్ 15 ఏండ్లపాటు బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం అదే పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన మేడిపల్లి ధనలక్ష్మి(ఎస్సీ) మద్దతుగా గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
ఆ తర్వాత ఈత చెట్లు గీసేందుకు వెళ్లాడు. శ్రీనివాస్‌గౌడ్‌పై కక్ష కట్టిన అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కేశగోని శ్రీనివాస్ ఆ కత్తితో వెనుక నుంచి దాడి చేశారు. బాధితుడి నొసలుకు గాయం కాగా, మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలవుతాడనే భయంతోనే దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాల్క సుమన్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లును ఫోన్లో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని సుమన్ ఆరోపించారు.