హైదరాబాద్, ఆగస్టు 25 : రాష్ట్రంలో గల అన్ని గ్రామాల్లోని గ్రామ కంఠం భూములకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గ్రామ కంఠంలోని భూ యజమానుల భూములు గుర్తించి, వాటికి చట్టబద్దత కల్పించి, క్రయ విక్రయాలకు కూడా వీలు కలిగే విధంగా రికార్డులు కల్పించడమే లక్ష్యంగా సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాజేంద్ర నగర్ TS IRDలో ఈ విషయమై డీపీఓలు, ఎంపీడీవోలు ఇతర అధికారులు, సర్పంచ్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేస్తున్నాం. పల్లె ప్రగతి వంటి పథకంతో గ్రామాల రూపు రేఖలు మార్చుకున్నాం.
ధరణి వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూ సమస్యలకు పరిష్కారం చూపెట్టాం. ఇదే తరహాలో గ్రామ కంఠం భూముల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు.
ఇందులో భాగంగా గ్రామ కంఠం భూములకు చట్టబద్దత కల్పించే విధంగా చేస్తూనే, భూములను స్థిరీకరించి, గుర్తించి, వాటి క్రయ విక్రయాలకు వీలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రస్తుంతం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మెదక్ జిల్లాలోని కొత్తపల్లి మల్లంపేట, మహబూబ్నగర్ జిల్లాలోని అన్నారెడ్డిపల్లి, నంచెర్ల గ్రామ పంచాయతీల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టామన్నారు.
అలాగే స్వామిత్వ పథకం కింద, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతి గూడ, మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమ కుంట, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి గ్రామం, కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం దోమకొండ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద డ్రోన్ ల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో గ్రామ కంఠాలకు సంబంధించి కొత్త మ్యాప్ లను సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఈ లోగా అధికారులు గ్రామ స్థాయిలో ఎదురువుతున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు.