Kangana | లెజెండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ చేసిన “మతపరమైన వివక్ష” వ్యాఖ్యలు ఇటీవలి రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పెద్ద ఎత్తున వాదనలు, ప్రతివాదాలు కొనసాగుతుండగా, తాజాగా బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రంగంలోకి దిగారు. రెహ్మాన్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి.జనవరి 17న (ముక్కనుమ పండగ రోజు) కంగనా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రెహ్మాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాలీవుడ్లో తనకు ఎదురవుతున్న పరిస్థితులపై స్పందిస్తూ, రెహ్మాన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆమె ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు.
ఇటీవల రెహ్మాన్ బాలీవుడ్లో మతపరమైన పక్షపాతం ఉందని, ఆ కారణంగానే తనకు అవకాశాలు తగ్గుతున్నాయనే భావన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కంగనా, తన రాజకీయ భావజాలం కారణంగా తాను కూడా ఇండస్ట్రీలో వివక్షను ఎదుర్కొంటున్నానని అన్నారు. “నేను ఒక రాజకీయ పార్టీకి (బీజేపీకి) మద్దతు ఇస్తున్నందున నాకు అన్యాయం జరుగుతోంది. కానీ మీకంటే ఎక్కువ పక్షపాతంతో, ద్వేషంతో వ్యవహరించే వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు” అంటూ రెహ్మాన్‌పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సంగీతం అందించాలంటూ ఏ.ఆర్. రెహ్మాన్‌ను సంప్రదించానని, కానీ ఆయన పూర్తిగా నిరాకరించారని కంగనా ఆరోపించారు. కథ వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని, ఆ సినిమా ఒక “ప్రొపగాండా” అన్న భావనతోనే దానికి దూరంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
అయితే ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని విమర్శకులు ప్రశంసించారని, ప్రతిపక్ష నేతలు కూడా మెచ్చుకున్నారని చెబుతూ, రెహ్మాన్ మాత్రం తన ద్వేషంతో అంధుడైపోయారని కంగనా మండిపడ్డారు. ఈ క్రమంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాపై కూడా కంగనా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర దర్శన సమయంలో తనకు చీర ఇవ్వడానికి మసాబా నిరాకరించిందని, ఆ అవమానంతో తాను కారులోనే కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. రాజకీయ భావజాలం కారణంగానే తనను దూరం పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వివాదానికి బీజం ‘చావా’ అనే తాజా చిత్రం విషయంలో రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఆయన “విభజనను ప్రోత్సహించే కంటెంట్” అన్న వ్యాఖ్యలు చేయడం కంగనా ఆగ్రహానికి కారణమయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత రెహ్మాన్ మత వివక్షపై మాట్లాడటంతో, కంగనా ప్రత్యక్షంగా ఎదురుదాడికి దిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.