Jadcherla | జడ్చర్ల టౌన్, జూలై 10: ఇప్పటి వరకు ఏదైనా కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పోలీస్ స్టేషన్‌లోని లాకప్ ఉంటారు. కానీ.. ఈ పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఓ కోడిపుంజు కూతూ కనిపించింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి శివారులో నాటు కోళ్ల దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల కిందట కరివెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బూరెడ్డిపల్లి గ్రామ శివారులో కోడిపుంజు దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.
ఇతడిని పోలీసులకు అప్పగించగా.. వారు నిందితుడితోపాటు కోడిపుంజును కూడా స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత నిందితుడిని లాకప్‌లో వేసి పోలీసులు విచారణ చేపట్టారు. కోడిపుంజును బయట ఉంచితే కుక్కలు తినే ప్రమాదం ఉందని పోలీసులు నిందితుడితోపాటు కోడిపుంజునూ లాకప్‌లో ఉంచారు. దానికి గింజలు వేస్తూ పోలీసులు కాపలా కాయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్టేషన్‌కు వచ్చిన వారందరూ లాకప్‌లో కోడిపుంజుకు పోలీసుల రక్షణ భలేగా ఉన్నదని చర్చించుకున్నారు. జడ్చర్ల పట్టణ సీఐ రమేశ్‌బాబును వివరణ కోరగా దొంగతనం కేసులో నిందితుడితో పాటు కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.