భీమదేవరపల్లి, అక్టోబర్ 27 : ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి చిన్నారి గడిపె అస్మిక(3) మృతి చెందిన విషాదకర ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గడిపె సంపత్, స్వర్ణలకు ముగ్గురు సంతానం. దినసరి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా, ఆదివారం అస్మిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా అస్మిక ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడింది.
అటుగా వెళ్తున్న అస్మిక మేనత్త కూతురు సుశాంకిత నీటి సంపులో పడి ఉన్న బాలికను చూసి వెంటనే బయటకు తీసి కుటుంబసభ్యులకు సమాచారం అందించింది.108కి సమాచారమందించగా సిబ్బంది వచ్చి అస్మిక మృతి చెందినట్లు వెల్లడించారు. అస్మిక తండ్రి సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఎస్ఐ దివ్య తెలిపారు. అస్మిక మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.