హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): అధిక వడ్డీ ఇస్తామంటూ దాదాపు 500 మంది ఖాతాదారులను నమ్మించి రూ.200 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ.. చివరికి ఐపీ పెట్టి బిచాణా ఎత్తేసింది. దీనిపై బాధితులు సోమవారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గతంలో హైదరాబాద్ అబిడ్స్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు (ఏపీసీఓబీ).. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు (టీఎస్‌సీబీ)గా మారింది. అందులో చాలా కాలం నుంచి పనిచేస్తూ మేనేజర్‌గా పదోన్నతి పొందిన కృష్ణా జిల్లా వాసి నిమ్మగడ్డ వాణీబాల.. ఆ బ్యాంకుకు సమీపంలోనే తన భర్త నేతాజీ, కుమారుడు శ్రీహర్షతో ‘ప్రియాంక ఎంటర్ప్రైజెస్’ అనే ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేయించింది.
ఆ సంస్థలో అధిక వడ్డీ చెల్లిస్తున్నారంటూ టీఎస్‌సీబీ ఖాతాదారులతోపాటు ఆ బ్యాంకు సిబ్బందిని సైతం నమ్మించి డిపాజిట్లు చేయించడంతో వారికి ప్రతి నెలా 15% వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. దీంతో టీఎస్‌సీబీ నుంచి ఎంతో మంది ఖాతాదారులు తమ డిపాజిట్లను ఉపసంహరించుకుని ‘ప్రియాంక’లో పెట్టుబడులు పెట్టారు. ఇలా గత 20 ఏండ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను పెంచుకున్న ఆ సంస్థ.. నిరుడు నవంబర్ నుంచి డిపాజిటర్లకు వడ్డీలు సరిగ్గా చెల్లించడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 3న ఆ సంస్థ దివాలా తీసినట్టు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నెల 31న వాణీబాల రిటైర్ కానున్న నేపథ్యంలో ఆమె భర్త, కుమారుడు ఈ నెల 15న తమ కార్యాలయంతోపాటు సైదాబాద్‌లోని తమ ఇంటికి కూడా తాళం వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో అబిడ్స్ పోలీసుల సూచన మేరకు బాధితులు సీసీఎస్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. నిందిలు విదేశాలకు పారిపోయి ఉండొచ్చని మూర్తి అనే బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు.