సుబేదారి/కమలాపూర్, ఏప్రిల్ 22 : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో కౌశిక్‌రెడ్డి హనుమకొండ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కట్టా మనోజ్‌రెడ్డి వద్ద రూ.25 లక్షలు తీసుకున్నారని, ఈ నెల 18న మళ్లీ ఆయనకు ఫోన్ చేసి బెదిరించినట్టు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మనోజ్‌రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీ నడవాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చంపుతానని భయపెట్టినట్టు ఆయన భార్య ఉమాదేవి ఈ నెల 21న ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గుండేడు-వంగపల్లి గ్రామాల మధ్య గ్రానైట్ క్వారీ నడుపుతున్న మనోజ్‌రెడ్డిపై గుండేడు గ్రామస్తులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్వారీ వ్యాపారం మొదలుపెట్టే ముందు తమ గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షలు ఇస్తానని గ్రామస్తుల సమక్షంలో ఒప్పుకున్న మనోజ్‌రెడ్డి.. రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చాడని, మిగతా రూ.10 లక్షలు ఇవ్వకపోవడంపై పలుమార్లు ఆయనను కలిసి అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో డబ్బులు ఇప్పించాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కోరడంతో మనోజ్‌రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని స్పష్టం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనోజ్‌రెడ్డిపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్, విజయ్, రాజేందర్, రాజలింగు, సదయ్య, రమేశ్, కొంరెల్లి, రామారావు విజ్ఞప్తి చేశారు.