జనగామ చౌరస్తా, మే 15: జనగామ పట్టణ కేంద్రంలోని ధర్మకంచ జడ్పీహైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి న్యూసెన్స్‌కు కారణమైన కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, దాసరి క్రాంతి, మేడ శ్రీనివాస్, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్కు చెందిన స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వీరస్వామి, మజీద్, తిప్పారపు విజయ్, మల్లిగారి రాజు, గజ్జెల నర్సిరెడ్డి, ఉల్లెంగుల సందీప్‌పై కేసు నమోదు చేసినట్టు అర్బన్ సీఐ ఎల్ రఘుపతిరెడ్డి తెలిపారు. ఈ బూత్‌లో విధుల్లో ఉన్న ఏఆర్ ఎస్సై కే శ్వేత ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి తన వర్గం నాయకులతో కలిసి పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించడంపై అక్కడే ఉన్న బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం తెలుపుతూ ప్రిసైడింగ్ అధికారికి చెప్పారు. పోలింగ్ కేంద్రం బయట ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే పల్లాతో కలిసి ప్రశాంత్‌రెడ్డిని బయటకు పంపించాలని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న ఏసీపీ అంకిత్‌కుమార్, సీఐ రఘుపతిరెడ్డి ఇరువర్గాలను శాంతింపజేస్తూ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను చెడగొట్టేలా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులు, వారితో గొడవకు దిగిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.