చింతలమానేపల్లి, జూలై 25: ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్కు చెందిన రైతు బసికిత్రి సాయినాథ్ సోమవారం ఉదయం తన పొలానికి ఎడ్లబండిపై బయలుదేరాడు. బాబాసాగర్ నుంచి నాయకపుగూడ వెళ్లే మార్గంమధ్యలోని వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎడ్లబండితోసహా కొట్టుకుపోతుండగా, అప్రమత్తమైన సాయినాథ్ నూతనంగా నిర్మిస్తున్న వంతెన పిల్లర్ సలాకలను పట్టుకున్నాడు. మెల్లిగా వాటి మీద నిలబడి కేకలు వేయడంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. జాలరుల సాయంతో తాడు ద్వారా రైతును ఒడ్డుకు చేర్చారు. ఎడ్లు సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. ఎడ్లబండిని కూడా తాళ్ల సాయంతో బయటకు తీశారు.