ఆదిలాబాద్, మే 20(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న చిరువ్యాపారుల దుకాణాలపైకి బుల్డోజర్ వెళ్లింది. మంగళవారం పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, పోలీసులు తొలగించారు. పట్టణంలోని శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, దేవిచంద్ చౌక్‌లో రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లో తోపుడు బండ్లు, షెడ్లు వేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు.
ఆక్రమణల ఫలితంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండగా.. మున్సిపల్ అధికారులు 201 మంది వీధి వ్యాపారులను గుర్తించి వారికి పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అధికారులు సూచించిన స్థలంలో తమ వ్యాపారాలు సాగవని, తాము ఉపాధి కోల్పోతామని ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.