Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాంపల్లిలోని ఈడీ కోర్టులో బుధవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఇదే కేసులో ఏ 4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. బుధవారం నాటి ఈడీ వాయిదాకు రావాలని, లేనిపక్షంలో తాను అదే కోర్టులో దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఆరేండ్లుగా ఓటుకు నోటు కేసులో కోర్టుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి హాజరైతే ట్రయల్ స్టార్ట్ చేస్తానని ఈడీ కోర్టు న్యాయమూర్తి చెప్తున్నారని, అందుకే ఒకసారి కోర్టు విచారణకు హాజరుకావాలని విజ్ఞప్తిచేశారు. కోర్టుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తనకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలని కోరారు.
ట్రయల్ స్టార్ట్ అయితే కేసులో జరిగిన వాస్తవాలు న్యాయమూర్తికి పూర్తిగా చెప్పి, అన్ని ఆధారాలు ఈడీ కోర్టుకు సమర్పించి, తన బాధ్యతను నెరవేర్చుకుంటానని చెప్పారు. ఓటుకు నోటు కేసులో ఆయా దర్యాప్తు సంస్థల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన అన్ని ఎవిడెన్స్‌ల కాపీలు, కొన్నింటిని అకడకడా మార్పులు చేసినా, వాటి అసలు కాపీల ఆధారాలు తన వద్ద భద్రంగా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2015లో మొదలైన ఓటుకు నోటు కేసు అనేక మలుపులు తిరిగిందని, తన పేరు అన్ని కేసుల్లో కొట్టివేశారని, కేవలం నాంపల్లి ఈడీ కోర్టులో మాత్రమే పెండింగ్‌లో ఉన్నదని చెప్పారు.
ముఖ్యులందరికీ అధికారిక పదవులు
ఓటుకు నోటు కేసులోని ముఖ్యులైన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా, చంద్రబాబు ఏపీ సీఎంగా కొనసాగుతున్నారని జెరూసలేం మత్తయ్య పేర్కొన్నారు. మరొకరు వేం నరేందర్‌రెడ్డి ఏకంగా తెలంగాణ సీఎంవో ముఖ్య సలహాదారుగా ఉన్నారని, మరొకరు ఉదయ్ సింహ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పదవిలో ఉన్నారని చెప్పారు. ప్రత్యక్ష సాక్షిని, పాత్రదారుడిగా ఏ-4గా ఉన్న తాను ఎటూకాకుండా పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకసారి చేసిన తప్పుకు బలైన బాధితుడిని అని వాపోయారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అలాంటిది ఆ ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యతాయుత హోదాలో ఉండి, శాసనమండలిలో మరొక గౌరవ ఎమ్మెల్సీ సభ్యుడి ఎంపికలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. ఇతర పార్టీల సహకారం కోరడం అనైతికమని పేర్కొన్నారు. ఎవరైనా స్వార్థం కోసం పార్టీ మారి బహిరంగంగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఒక పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు, పదవుల ఆశచూపి తమ పార్టీల్లో చేర్చుకోవడం నీచమని మండిపడ్డారు.
స్నేహితుడి కోసం రేవంత్ నన్ను బలిచేశారు!
రేవంత్‌రెడ్డి తన స్నేహితుడైన వేం నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పోస్టు ఇప్పించుకోవడానికి తనను బలి చేశారని జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబును బలవంతంగా ఒప్పించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారిక ఎమ్మెల్యేల కొనుగోలును మొదలుపెట్టారని ఆరోపించారు. ఒక క్రిస్టియన్ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను ఒప్పించడానికి తనను క్రైస్తవ సంస్థ ప్రతినిధిగా వాడుకోవడం దారుణమని పేర్కొన్నారు. తనతో సంప్రదించడానికి వారి పార్టీలోని మరొక క్రిస్టియన్ లీడర్ జిమ్మిబాబును సంప్రదించారని గుర్తుచేశారు. ఇందులో మరొకరు అప్పటి రేవంత్ పార్టీ అనుకూల బిషప్ సెబాస్టియన్‌ను వాడారని తెలిపారు. ఆ తర్వాత ఇది రెండు రాజకీయ పార్టీల గొడవగా, మారి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారిందని గుర్తుచేశారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టుల మధ్య, రాజీ ప్రయత్నాలు, ఆధారాల చెరిపివేత, సాక్షాల మార్చివేతలు జరిగి అన్ని కోర్టుల్లో అన్ని దర్యాప్తు సంస్థల్లో కేసు బలహీనమై దాదాపు దోషులందరికీ ప్రశాంతత దొరికిందని కేసు సాగిన క్రమాన్ని వివరించారు.
సజీవంగా ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షిని నేనే..
తాజాగా సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం, రీ ఓపెన్ చేయడానికి ఏపీ వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణ వేసిన పిటిషన్ కొట్టేయడం, కేసును వేరే రాష్ట్రానికి మార్చమని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడంతో దాదాపుగా కేసు పూర్తిగా నీరుగారిపోయేలా మారిందని మత్తయ్య తెలిపారు. తాము ముద్దాయిగా అధికారికంగా ఉన్న నాంపల్లి ఈడీ కోర్టు మాత్రమే కొద్దిగా కేసును ప్రభావితం చేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఇతరులకు ఇబ్బందిగా ఉండబోతుందని చెప్పారు. అందుకు సజీవంగా ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షిని తానేనని చెప్పారు. నాంపల్లి ఈడీ కోర్టులో బుధవారం ఏ 1 ముద్దాయి రేవంత్ హాజరై తన ఐడెంటిఫికేషన్ పూర్తి చేసుకుంటే కోర్టు వారు ట్రయల్ మొదలు పెట్టి ఓటుకు నోటు కేసు విచారణ మొదలు పెడతారని చెప్పారు. ఈడీ కోర్టు విచారణలో న్యాయసహాయం, న్యాయవాది ఖర్చుల కోసం ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ, అప్పటి ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శివధర్‌రెడ్డిని పలుమార్లు కలిసి ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కోరగా నిరాకరించారని చెప్పారు. రేవంత్‌ను అడుకోపో.. అంటూ నిర్లక్ష్యంగా గెంటివేశారని ఆరోపించారు. సోమవారం ఇంటెలిజెన్స్ ఆఫీసులో కలవడానికి వెళ్తే కారెకి వెళ్లిపోయారని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో ఏ 1 ముద్దాయి రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరు కావాలని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. తోటి ముద్దాయిగా పిలుపునిస్తున్నా. రేవంత్ కోర్టుకొచ్చి నిజాలు చెప్పి న్యాయస్థానాన్ని గౌరవించాలి. లేనిపక్షంలో ఇప్పటివరకు రేవంత్.. ఈ కేసులో ఆధారాలు ఎకడెకడ చెరిపివేశాడో.. తిరిగి నా దగ్గర ఉన్న నిజమైన అన్ని ప్రూఫ్‌లను కోర్టులకు, దర్యాప్తు సంస్థలకు ఇచ్చి తనతో సహా అందరికీ శిక్షపడేటట్టు చేస్తా.
– జెరూసలేం మత్తయ్య