గుండాల, అక్టోబర్ 7: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో 13వ శతాబ్దం నాటి పొడవు జడ కలిగిన వీరుడి శిల్పాన్ని(ఎక్కటి శిల్పం) చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి కనుగొన్నారు. గ్రామంలోని శివుడి బండ మీద ఉన్న రాతి శిల్పంతో కూడిన శిలాశాసనాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 13వ శతాబ్దం నాటి వీరులు పొడవైన జుట్టును కలిగి ఉండేవారని, వాటిని పాయలుగా విడదీసి అల్లినట్లుగా ఉండేవని తెలిపారు.
అందుకు సంబంధించిన ఆనవాళ్లను శిలపై చెక్కిన శిల్పంలో ఉన్నట్టు చెప్పారు. అటువంటి వీరులు గ్రామ రక్షణ కోసం రణరంగంలో పోరాడేవారని పేర్కొన్నారు. భుజాలకు దండ కడియాలు, నడుముకు కత్తి, కాళ్లకు కడియాలు ధరించి బాణం సంధిస్తున్నట్టు బండరాతిపై వీరుడి చిత్రం చెక్కబడిందని తెలిపారు. ఆ వీరుడి జ్ఞాపకార్థంగా నాటి పాలకులు శిల వేసి ఉంటారని వెల్లడించారు.