కూసుమంచి, అక్టోబర్ 3 : సర్పంచ్ అభ్యర్థి రిజర్వేషన్ మార్చకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండా గ్రామస్థులు తేల్చిచెప్పారు. సర్పంచ్ పదవి బీసీకి రిజర్వ్ కావడంతో ఈ తండావాసులు శుక్రవారం గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. ధర్మాతండాలో 500 మంది ఎస్టీ ఓటర్లు ఉండగా, కేవలం రెండే రెండు బీసీ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ మార్చకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సహా సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చేపట్టాల్సిందిపోయి రెండు ఓట్లు ఉంటే రిజర్వేషన్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేస్తామని, రిజర్వేషన్ మార్చేదాకా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఈ నిరసనలో తండావాసులు గూగులోత్ కోట్యా, జర్పుల లాలు, జర్పుల రవి, వడ్త్య ప్రసాద్, వడ్త్య నారాయణ, బానోతు ఫుల్సింగ్, జీ వీరన్న, లాలుప్రసాద్, జే రవి, కుమార్, జర్పుల కృష్ణ, సురభి, సురేశ్, సుమన్, అశోక్, కళ్యాణ్ పాల్గొన్నారు.
ధర్మాతండాకు చెందిన ఒకే ఒక బీసీ కుటుంబం కుమ్మరికుంట్ల నాగరాజు, శ్రావ్య ఇద్దరికి ధర్మాతండాతోపాటు కేశవపురంలో కూడా ఓట్లు ఉన్నాయని కూసుమంచిలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి భీమ్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి తండావాసులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ధర్మాతండాలో వారి ఓట్లను తొలగించి కేశవపురంలో ఉంచాలని పేర్కొన్నారు. ఇదిలాఉండగా 30 ఏండ్లుగా ధర్మాతండాలో ఉంటున్నామని, కేశవపురంలో ఉన్న ఓటును తీసివేయమని దరఖాస్తు చేసుకున్నట్టు కుమ్మరికుంట్ల నాగరాజు తెలిపారు.