Group 1 Mains | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో ఒక్కొక్కటి చొప్పున లోపాలు వెలుగు చూస్తున్నాయి. జనరల్ ఎస్సే పేపర్లో టాపర్‌కు మించి ఓ అభ్యర్థికి మార్కులు వేసిన గుట్టు తాజాగా బయటపడింది. ఆ అభ్యర్థి కూడా తెలుగు మీడియం అభ్యర్థి కాకపోవడం గమనార్హం. గ్రూప్-1లో జనరల్ ఎస్సే పేపర్లో మూడు సెక్షన్లలో ఆరు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 50 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు మాత్రం మూడు ప్రశ్నలకే సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు సమాధానం రాసేందుకే గంట పడుతుంది. సివిల్స్ రాసిన వారు కూడా ఈ పేపర్ అంటేనే టెన్షన్ పడతారు. ఈ పేపర్లో ఎక్కువలో ఎక్కువగా 60 మార్కులు దాటడమే గగనం.
అలాంటి పేపర్లో నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి ఏకంగా 97.5 మార్కులేశారు. గ్రూప్-1 మెయిన్స్ స్టేట్ టాపర్‌కు వచ్చిన మార్కులు 150కి వచ్చింది 65.5 మార్కులే. కానీ ఆ తెలుగు మీడియం కాని అభ్యర్థికి ఏకంగా 97.5 మార్కులొచ్చాయి. అనధికారిక సమాచారం మేరకు జనరల్ ఎస్సే పేపర్లో ఇవే అత్యధిక మార్కులు. మరీ విశేషమేంటంటే సదరు అభ్యర్థికి 6 పేపర్లల్లో వచ్చిన మార్కులతో పోల్చితే, జనరల్ ఎస్సేలోనే అత్యధికంగా మార్కులొచ్చాయి. మిగతా ఏ పేపర్లోనూ 90 మార్కులు దాటలేదు. స్టేట్ టాపర్ కంటే సదరు అభ్యర్థికి ఒకే పేపర్లో 31.5 మార్కులు అత్యధికంగా రావడం గమనార్హం. సివిల్స్‌లో సాధ్యంకాని మార్కులు గ్రూప్-1లో ఎలా సాధ్యమని, మరీ ముఖ్యంగా స్టేట్ టాపర్ కన్నా ఎక్కువ మార్కులెలా వచ్చాయని తోటి అభ్యర్థులే ప్రశ్నిస్తున్నారు. ఇలా రావడం వెనుక ఏదో లోగుట్టు ఉన్నదని అభ్యర్థులు అనుమానిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో లోపాలున్నాయనడానికి ఇదే నిదర్శమని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఓ అకాడమీలో కోచింగ్‌తోపాటు, ప్రాక్టీస్ కోసం టెస్ట్ సిరీస్ తీసుకున్నది. అకాడమీలో రోజూ 50కిపైగా అభ్యర్థులు టెస్ట్ సిరీస్ రాసేవారు. రోజూ ఆ మహిళా అభ్యర్థికి 15 మార్కుల ప్రశ్నకు 6 మార్కులొచ్చేవి. అదే కోచింగ్ సెంటర్లోని మిగతా వారికి 3 మార్కులకు మించకపోయేవి. ఇలాగే 4 నెలలపాటు జరిగింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను సదరు అభ్యర్థి తెలుగులో రాయగా, మిగతా వాళ్లంతా ఇంగ్లిష్ మీడియంలో రాశారు. తీరా మెయిన్స్ జీఆర్ఎల్ చూస్తే అవాక్కవడం సదరు తెలుగు మీడియం అభ్యర్థి వంతైంది. తెలుగులో పరీక్ష రాసిన ఆ అభ్యర్థి జీఆర్ఎల్ ర్యాంకు 3వేలలోపు ఉంటే, ఇంగ్లిష్ మీడియంలో రాసిన వారేమో 300 ర్యాంకులోపే ఉన్నారు. తెలుగులో మెయిన్స్‌లో రాయడమే ఆ అభ్యర్థి చేసిన తప్పయింది. ఇలాంటి అనేకం ఉదాహరణలను అభ్యర్థులు ఆధారాలుగా చూపుతున్నారు. గ్రూప్-1 మెయిన్స్‌ను తెలుగు మీడియంలో రాసిన వారికి అన్యాయం జరిగిందని, ఇంగ్లిష్ మీడియంలో రాసిన వారికి ఎక్కువ మార్కులు వేశారని వారంతా వాదిస్తున్నారు.
ఉత్తుత్తి మార్కులేశారా?
గ్రూప్-1 జీఆర్‌ఎల్‌ను పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఒకరికో ఇద్దరికో ఒకే తరహా మార్కులు రావడం సహజం.. కానీ గ్రూప్-1లో 1,472 మంది అభ్యర్థులకు ఒకే స్థాయి మార్కులు వచ్చాయి. వీరిలో పక్కనే పరీక్షలు రాసిన వారు, బెంచీ విడిచి మరో బెంచీలో ఉన్నవాళ్లు ఉన్నారు. మరీ ముఖ్యంగా పక్క పక్క బెంచీల్లో ఉన్న వారికి సేమ్ మార్కులు వచ్చాయి. మధ్యలో ఒకరిని వదిలి ముందు వెనుకున్న వాళ్లకూ ఒకే మార్కులు వచ్చాయి. మధ్యలో ఇద్దరిని తప్పించి సేమ్ మార్కులొచ్చిన వారు, మధ్యలో ముగ్గురిని తప్పించి, నలుగురిని తప్పించి ఒకే మార్కులు వచ్చిన వాళ్లు అనేకం. నిజంగా పేపర్లు దిద్దిండ్రా.. లేక ఉత్తుత్తిగానే మార్కులేసిండ్రా అన్న భావన కలిగేలా పలువురి మార్కులు ఉండటం గమనార్హం. ఒక సెంటర్లో 41 మందిలో 20 మంది అభ్యర్థులకు 400కు పైగా మార్కులు చ్చాయి. దీన్నిబట్టి చూస్తే వరుసబెట్టి మార్కులు వేసినట్టుగా అనిపిస్తున్నది. ఒకేతరహా మార్కులు రావడం ఎలా సాధ్యమని అభ్యర్థులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ లెక్కన గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాలను నిజంగానే మూల్యాంకనం చేశారా, లేక మూల్యాంకనం చేయకుండా మార్కులేశారా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.