హైదరాబాద్ జూలై 14 (నమస్తేతెలంగాణ): ‘కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం మోగుతూనే ఉన్నది.. హస్తం పార్టీ గద్దెనెక్కిన 20 నెలల్లో 93 మంది విద్యార్థుల మరణమే ఇందుకు నిదర్శనం.. బీఆర్ఎస్ పాలనలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులాలు, రేవంత్ ఏడాదిన్నర ఏలుబడిలో దిక్కుమాలిన పరిస్థితికి చేరాయి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. స్వయంగా సమీక్షిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటిమూటలే అయ్యాయని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం జ్యోతిబాఫూలే బాలుర గురుకుల కళాశాలలో విద్యార్థి మరణం, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేట బీసీ గురుకుల స్కూల్లో ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య, నల్లగొండ జిల్లా దేవరకొండ ఎస్టీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 15మంది విద్యార్థులు దవాఖాన పాలవడం, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట బీసీ గురుకుల విద్యార్థులు పురుగుల అన్నం వద్దని రోడ్డెక్కిన ఘటనలు తీవ్రంగా బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనలు, విద్యార్థుల మరణాలకు ఎ వరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ‘గురుకులాల ఖ్యాతి నానాటికీ దిగజారుతున్నదంటే ఇందుకు కారకులెవరు రేవంత్‌రెడ్డీ? పేద విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా?’ అని నిలదీశారు.
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, రేవంత్ పాలనా వైఫల్యంతో నిర్వీర్యమవుతున్నాయని హరీశ్ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్నదని వాపోయారు. విద్యాసంవత్సరం మొదలైందంటే తమ పిల్లలు బడిలో భద్రంగా చదువుకుంటారని సంబురపడాల్సిన తల్లిదండ్రులు వారి ప్రాణాల గురించి ఆందోళన చెందాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థుల మరణ వార్తలు విని ఊర్లలోని వారి తల్లిదండ్రులు భయపడే దుస్థితి నెలకొనడం బాధాకరమని, కాంగ్రెస్ ప్రభు త్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ భా వి తెలంగాణ పౌరులను బలితీసు కుంటున్నదని నిప్పులు చెరిగారు.
‘మాటలే తప్ప చేతలెరుగని ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరికి ఇంకెందరు విద్యార్థులు దవాఖాన పాలు కావాలి? ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి?’ అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల మెస్‌చార్జీల చెల్లింపునకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రగల్బాలు పలికి ఏడాది దాటింది తప్ప అమలు చేసిందేమీలేదని విమర్శించారు. గురుకుల విద్యార్థులు ఇంకెంతకాలం ఉడకని అన్నం, నీళ్ల చారు, నాణ్యత లేని పప్పు తినాలి? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో గుడ్ల సరఫరా నిలిచిపోయి విద్యార్థులు గొడ్డు కారం తినాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం సోయి తెచ్చుకొని విద్యార్థుల మరణాలను ఆపాలని, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.